మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక వేడిలో ఆయారాం గయారాంలకు కూడా పని దొరికింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు.. సందడిలో సడేమియాగా అటూ ఇటూ జంపులు చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితిని వీడి భారతీయ జనతా పార్టీ పంచన చేరారు. ఒకప్పటి తన ప్రత్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోసం ఇప్పుడు నర్సయ్య గౌడ్ పని చేయాలి!
2014లో తెలంగాణ ఏర్పడ్డాకా జరిగిన తొలి ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయగా, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి నర్సయ్య గౌడ్ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో నర్సయ్య గౌడ్ విజయం సంచలనం లాంటిదే. దాదాపు ముప్పై వేల ఓట్ల మెజారిటీతో నర్సయ్యగౌడ్ అప్పుడు రాజగోపాల్ రెడ్డిపై గెలుపు సాధించారు.
అయితే గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో నర్సయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు. ఇది కూడా స్వల్ప ఓట్ల తేడాతోనే. వెంకట్ రెడ్డి దాదాపు ఐదు వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. మరి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ నర్సయ్య గౌడ్ కు దక్కేదో లేదో కానీ ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ బాట పట్టారు!
ఇక నర్సయ్య గౌడ్ అటు చేరగా, ఇంతలోనే భిక్షమయ్య గౌడ్ అటు నుంచి ఇటు చేరారు. కొన్నాళ్ల కిందట బీజేపీలో చేరిన బూడిద భిక్షమయ్య గౌడ్.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బీజేపీ నేతలు దగ్గరుండి కొన్నాళ్ల కిందటే ఈయనను చేర్చుకున్నారు. అయితే మునుగోడు అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ పార్టీ ఆయనను ఇటు వైపుకు లాగింది. నర్సయ్య గౌడ్ ను బీజేపీ చేర్చుకుంటే, భిక్షమయ్య గౌడ్ ను బీఆర్ఎస్ చేర్చుకుంది. బ్యాలెన్స్ అయ్యింది కాబోలు.