తిరుమలలో సంప్రదాయ భోజనంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు టీటీడీ వెనక్కి తగ్గింది. తప్పులు చేయడం, విమర్శలొస్తే వెనక్కి తగ్గడం టీటీడీలో సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరంపరలో టీటీడీ ఉన్నతాధికారుల అత్యుత్సాహం … జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండడంతో పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
లాభాపేక్ష లేకుండా భక్తులకు సంప్రదాయ భోజనం పెట్టేందుకు… ఇటీవల టీటీడీ ట్రైల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. చివరికి ప్రసాదంగా భావించే అన్నానికి కూడా టీటీడీ వెల కడుతోందని, దీని వెనక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మతాన్ని తెరపైకి తేవడంతో వివాదం రాజుకుంది.
దీంతో నష్ట నివారణ చర్యలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేపట్టారు. సంప్రదాయ భోజనాన్ని వెంటనే నిలిపేస్తున్నట్టు ఆయన ప్రకటించి, విమర్శలకు చెక్ పెట్టారు. ఇంకా పాలక మండలి ఏర్పడక ముందు టీటీడీ అధికారులు సంప్రదాయ భోజనంపై నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
ఇందులో ప్రభుత్వ తప్పేమీ లేదని ఆయన పరోక్షంగా సందేశాన్ని ఇచ్చారు. స్వామివారి ప్రసాదం గానే భోజనం అందించాలని.. అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని తాజాగా ఆయన ప్రకటించడం గమనార్హం.