ప్రస్తుతం టీఆర్ఎస్ లో మంత్రి పదవులు అనుభవిస్తున్నవారిలో సగం మందికి పైగా గతంలో కేసీఆర్ ని చెడామడా తిట్టినవారే. అప్పట్లో తామున్న పార్టీల అజెండా మేరకు రాష్ట్ర విభజనను వ్యతికేరించినవారే. తలసాని శ్రీనివాస్, ఎర్రబెల్లి దయాకర్.. టీడీపీలో ఉండగా కేసీఆర్ ని ఎన్నెన్ని మాటలన్నారో అందరికీ ఇప్పటికీ గుర్తే. ఎందుకంటే ఆ మాటలు అలాంటివి. కొత్త కొత్త తిట్లు, తెలంగాణ సామెతలు వెదికి మరీ కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.
అంతెందుకు కాలక్రమంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కేకే, డీఎస్ లు.. పూర్వాశ్రమంలో కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ పాలిటిక్స్ ఫాలో అయ్యేవాళ్లు చెబుతారు. టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఎంత ఉధృతంగా పనిచేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలా తిట్టిన ఎంతోమంది మహానుభావులు ఆ తర్వాత టీఆర్ఎస్ లో సర్దుకున్నారు. చివరికి నిన్నటి వరకూ టీడీపీలో ఉంటూ తనను తిట్టిపోసిన ఎల్.రమణకు ఇటీవల కేసీఆర్ పిలిచి పెద్దపీట వేస్తున్నారు.
పాడి కౌశిక్ రెడ్డి పాత వీడియోలు చూస్తే.. కేసీఆర్ పై ఆయన ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో తెలుస్తుంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, కౌశిక్ రెడ్డిని కూడా కౌగిలించుకున్నారు. ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. పార్టీలో నుంచి పోతూ కేసీఆర్ ని తిట్టడం, వచ్చేటప్పుడు పొగడటం, కాకా కొడుకులు వినోద్, వివేక్ కి బాగా అలవాటు. అయినా కూడా కేసీఆర్ పెద్దగా పట్టించుకోరు. తనను పొగిడిన వారి కంటే.. తిట్టినవారికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కేసీఆర్ కి బాగా అలవాటు. తనను తిట్టినవారితోటే పొగిడించుకోవడం ఆయనకు అదో తుత్తి.
ఈ లిస్ట్ లో చేరేందుకు సిద్ధమవుతున్న మరో నేత మోత్కుపల్లి నర్సింహులు. పైన చెప్పుకున్న అందరికంటే.. దారుణంగా కేసీఆర్ ని తిట్టిన వ్యక్తుల్లో మోత్కుపల్లి నెంబర్-1 స్థానంలో ఉంటారు. టీడీపీలో ఉండగా చంద్రబాబు, మోత్కుపల్లిని ఓ రేంజ్ లో వాడారు. కేవలం కేసీఆర్ ని తిట్టడం కోసమే మోత్కుపల్లిపై మీడియా ఫోకస్ పెంచేలా చేసేవారు. కాలక్రమంలో చంద్రబాబు కుట్రలు అర్థం చేసుకున్న మోత్కుపల్లి.. అక్కడా ఇక్కడా చేరి.. చివరకు బీజేపీకి కూడా రాజీనామా చేసి ఒంటరిగా ఉన్నారు.
టీఆర్ఎస్ కి చేరువవ్వడానికి ప్రయత్నిస్తున్న ఆయన.. దళితబంధు పథకానికి మద్దతుగా చేపట్టిన దీక్ష పేరుతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. దళితబంధు పథకానికి ప్రతిపక్షాలు అడ్డు పడినా, ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో అలసత్వం వహించినా తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు.
ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. గతంలో కేసీఆర్ ని తిట్టినోళ్లకి, ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి అడ్డుపడినవారందరికీ పదవులొచ్చేశాయి, ఒక్క మోత్కుపల్లికి తప్ప. ఇప్పుడు ఆ కోటా కూడా పూర్తవుతుందని అంటున్నారు.
ఆ మధ్య దళితబంధు పథకం అమలు కమిటీకి మోత్కుపల్లిని చైర్మన్ గా చేస్తారని అనుకున్నారంతా. మరి కేసీఆర్ మనసులో ఏముందో..? తనను చెడామడా తిట్టి, ఇప్పుడు తనను పొగడ్తల్లో ముంచెత్తుతున్నందుకు మోత్కుపల్లికి కూడా పదవి ఇచ్చేసి తన పెద్దమనసు చాటుకుంటారేమో చూడాలి.