నోరు జారారా.. లేక మనసులో మాట అదేనా..?

“రాబోయే 20 ఏళ్లపాటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటాయి.” ఎవరో ఆషామాషీ వ్యక్తి చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ తెలంగాణ మంత్రి మనోగతం ఇది. ఓవైపు తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కొట్లాట…

“రాబోయే 20 ఏళ్లపాటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటాయి.” ఎవరో ఆషామాషీ వ్యక్తి చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ తెలంగాణ మంత్రి మనోగతం ఇది. ఓవైపు తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కొట్లాట తీవ్ర స్థాయిలో జరుగుతున్న సందర్భంలో.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలా మాట్లాడటం చర్చనీయాంశమైంది.

టీఆర్ఎస్ బహిష్కృత నేత ఈటల రాజేందర్, బీజేపీ తరపున హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంలో.. మేము మేము ఒకటేనంటూ బీజేపీకి మద్దతుగా టీఆర్ఎస్ మంత్రి చేసిన వ్యాఖ్యలను మరో ప్రతిపక్షం కాంగ్రెస్ ఊరకనే వదిలిపెడుతుందా? ఈటల రాజేందర్ బీజేపీ చేరికకు కిషన్ రెడ్డి వచ్చిన స్పెషల్ ఫ్లైట్ ని అరేంజ్ చేసింది కేసీఆరేనంటూ రేవంత్ రెడ్డి ఆమధ్య రెండు పార్టీలను ఒకే గాటన కట్టి విమర్శించారు. ఇప్పుడీ స్టేట్ మెంట్ తో రేవంత్ రెడ్డి తన మాటలకు మరింత పదువు పెట్టడం ఖాయం.

నోరుజారారా..?

క్రీడా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పక్కనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండటంతో కాస్త ఉద్వేగానికి గురయ్యారు. అలా మైక్ లో మాట్లాడుతూ “అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ మరో 20ఏళ్లు పక్కా” రాసిపెట్టుకోండి అని చెప్పారు. 

తెలంగాణ అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇటీవలే జన ఆశీర్వాద యాత్రలో కేసీఆర్ ని చెడామడా తిట్టిన కిషన్ రెడ్డికి ఇదంతా విచిత్రంగా తోచింది. తమ పార్టీపై టీఆర్ఎస్ మంత్రి ఇంత ప్రేమ కురిపిస్తున్నారేంటా అని ఆయన ఆశ్చర్యపోయారు.

టీఆర్ఎస్ మనసులో మాట అదేనా..?

గతంలో కేంద్ర పథకాలన్నిటినీ తీవ్రంగా విమర్శించిన కేసీఆర్, ఆయుష్మాన్ భారత్, నూతన వ్యవసాయ చట్టాలను కూడా స్వాగతించారు. దీంతో ఒకరకంగా బీజేపీ, టీఆర్ఎస్ స్నేహబంధం బలపడుతుందని అనుకున్నారంతా. ఆ తర్వాత ఈటల ఎపిసోడ్ తో మరోసారి బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పరిస్థితులు ఉప్పు-నిప్పులా మారాయి.

హుజురాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలతో హుజూరాబాద్ లో ఓటర్లకు టీఆర్ఎస్ ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటుందో తేలాల్సి ఉంది.

టీఆర్ఎస్ స్నేహహస్తం బీజేపీకి ఇష్టమే కానీ.. తెలంగాణలో బలపడాలనుకుంటున్న ఈ దశలో మాత్రం కోరి టీఆర్ఎస్ వరించినా.. బీజేపీ అధిష్టానం కుదరదనే సమాధానం చెబుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.