బాలీవుడ్ వెలుగుతున్న హీరోయిన్లను తెలుగు వైపుకి అప్పుడప్పుడైన తెప్పించుకుని నటింపజేయడం కొత్తేమీ కాదు. అలాంటి వారికి తెలుగు లేదా తమిళ మూవీ మేకర్లు భారీ పారితోషకాలనే ఎరగా వేస్తూ ఉంటారు.
గతంలో అయితే ఈ మానియా మరింత ఎక్కువగా ఉండేది! అప్పటికి ఇంకా పూర్తిగా మోడలింగ్ ఇండస్ట్రీని దాటి రాని వారికి కూడా కోటి రూపాయల రెమ్యూనిరేషన్ ఇచ్చి నటింపజేసిన దాఖలాలు కూడా ఉన్నాయి టాలీవుడ్ లో. ఆ పరిస్థితి ఇప్పుడు కొంత మారింది. సౌత్ సినిమాలను చాలా వరకూ కన్నడ అమ్మాయిలు, మలయాళీలు, తమిళ అమ్మాయిలు ఏలుతున్నారు.
ఇక నార్త్ అమ్మాయిలు ఇక్కడ నటిస్తున్నా.. వారేమీ బాలీవుడ్ ట్యాగ్ తో రావడం లేదు. ఇక్కడే హీరోయిన్లయ్యారు, ఇక్కడే కొనసాగుతున్నారు. బాలీవుడ్ లో వారికి అడపాదడపా అవకాశాలు వస్తున్నా, వాళ్లకు సౌతే కేరాఫ్ అవుతోంది. ఆ సంగతలా ఉంటే.. తెలుగు మూవీ మేకర్లకు అప్పుడప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల అవసరం అయితే ఏర్పడుతోంది. హీరోయిన్ల కొరత, ప్యాన్ ఇండియా ఇమేజ్ అంటారు, వాళ్లకు ఇక్కడున్న క్రేజ్ ను వాడుకోవడం అయితేనేం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను అడపాదడపా హైర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఇలాంటి అవకాశాలకు అప్పుడప్పుడు వారు కూడా ఓకే చెబుతున్నారు. ఇలాంటి వారిలో కియరా అధ్వానీ ఒకరు. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు చేసినా, అప్పటికీ-ఇప్పటికీ కియరా రేంజ్ మారింది! మహేష్ తో సినిమా చేసే సమయానికి ఈమెకు బాలీవుడ్ లో ఓ మోస్తరు గుర్తింపు. ఇక ఇటీవలి కాలంలో కియరా ఖాతాలో అక్కడ హిట్లు, క్రేజీ సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో రెమ్యూనిరేషన్ కూడా పెరిగింది. ప్రస్తుతం కియరా నాలుగు కోట్ల రూపాయల రేంజ్ పారితోషికం తీసుకుంటోంది. ఇటీవలి 'షేర్షా' సినిమాకు ఆమె ఈ అమౌంట్ పొందిందట.
ఇప్పుడు కియరా చేతిలో తెలుగు సినిమాల ఆఫర్లున్నాయి. వీళ్లు కూడా ఈమెకు అదే స్థాయి సొమ్ములు ఆఫర్ చేయక తప్పకపోవచ్చు. ఇది వరకే సౌత్ లో నాలుగు కోట్ల పారితోషకం తీసుకున్న హీరోయిన్లు పెద్దగా లేనట్టే. నయనతార మాత్రమే, ఈ రేంజ్ వరకూ వచ్చింది.
స్టార్ హీరోల సినిమాల్లో నటించాలంటే మూడు కోట్ల రూపాయలకు పైనే ఇవ్వాలంటూ, అది కూడా ప్రమోషన్ కార్యక్రమాల వైపు చూసే ఛాన్సే లేదంటూ, షరతులు పెట్టిందంటారు. సోలోగా కూడా సినిమాలను నడిపించేసిన నయనతార నాలుగు కోట్లు, ఆ పై పారితోషకాన్ని కూడా పొందిందనే వార్తలు గతంలో వచ్చాయి. మరి నయనతార అంత ట్రాక్ రికార్డు లేకపోయినా, బాలీవుడ్ ట్యాగ్ నేపథ్యంలో కియరా నాలుగు కోట్ల రెమ్యూనిరేషన్ ను సులువుగానే పొందుతోంది.