యాత్ర సరే టిడిపి నాయకుల దూల తీరుతోంది!

రైతులం అని చెప్పుకునే ముసుగులో ఒక పెద్ద సమూహం- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది కేవలం అమరావతిలో మాత్రమే ఉండాలని… రాజధానికి ముడిపడి జరగగల అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కావాలని డిమాండ్…

రైతులం అని చెప్పుకునే ముసుగులో ఒక పెద్ద సమూహం- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది కేవలం అమరావతిలో మాత్రమే ఉండాలని… రాజధానికి ముడిపడి జరగగల అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కావాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర సాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే! మూడు ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి దక్కాలని ప్రభుత్వ సంకల్పానికి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్ర ఇది. 

అధికారపక్షం ఆరోపిస్తున్న మేరకు… రైతులు కాదు కదా అమరావతి ప్రాంతానికి చెందిన కోటీశ్వరులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సాగిస్తున్న యాత్ర ఇది. ఏదైతేనేం మొత్తానికి అమరావతిలో మొదలైన యాత్ర అరసవిల్లి దిశగా ముందుకు సాగుతోంది. విపరీతమైన పోలీసు భద్రత మధ్య ఈ యాత్ర ముందుకు సాగడం సంగతేమో గాని.. యాత్ర పుణ్యమా అని తెలుగుదేశం నాయకులకు దూల తీరుతోంది. యాత్రకు స్థానికంగా ప్రజల మద్దతు ఉన్నదనే బిల్డప్ కోసం.. పాపం లోకల్ తెలుగుదేశం నాయకులు చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. జనాన్ని పోగేయాల్సి వస్తోంది.

అమరావతి రైతుల పేరిట సాగుతున్న పాదయాత్ర అచ్చంగా తెలుగుదేశం స్పాన్సర్డ్ యాత్ర మాత్రమే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకు మనకు అనేక అనేక రుజువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. తిరుమల వరకు యాత్ర సాగినప్పుడు కూడా.. ప్రతిచోట తెలుగుదేశం నాయకులు పాదయాత్ర చేస్తున్న వారికోసం సకల ఏర్పాట్లూ చేశారు. వారికి భోజనాలు వసతి సదుపాయాలు అన్నీ కల్పించారు. స్వాగత తోరణాలు బ్యానర్లు ఫ్లెక్సీలు వంటివి కూడా చేశారు. అసలే పార్టీ అధికారంలో లేదు.. మళ్లీ వస్తుందో లేదో గ్యారెంటీ కూడా లేదు. అయినా సరే డబ్బు ఖర్చుపెట్టి కార్యక్రమాలు చేయాలంటే తెలుగుదేశం నాయకులకు చాలా తెగువ ఉండాలి. కానీ పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు.. పారు తప్పదన్నట్లుగా ఇదంతా చేశారు. ఖర్చులు భరించారు. ఇప్పుడు అమరావతి నుంచి ఉత్తరాంధ్ర వైపు ఉన్న తెలుగుదేశం నాయకులకు ఆ భారం  పడుతోంది. 

మరో రకంగా చెప్పాలంటే వీరి పరిస్థితి ఇంకా కష్టం. విశాఖలో రాజధానిని వ్యతిరేకించడం వలన తమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో కూడా వీరికి స్పష్టత లేదు. అయినా సరే పార్టీ అధిష్టానం ఒత్తిడి మేరకు వాళ్ళు పాదయాత్ర కోసం తమ సొంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం  ఏర్పడుతోంది. రాజమండ్రి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు అమరావతి యాత్రకు మద్దతుగా చాలా ఓవరాక్షన్ చేయడం కూడా ఇందులో భాగమే. సాగుతున్నంత దూరం పచ్చటి కార్పెట్ పరిచి మరి వారిని ఆహ్వానించడం.. దారికి రెండు వైపులా బంతిపూల తోరణాలు కట్టడం.. జై అమరావతి జయహో అమరావతి అంటూ నినాదాలు రాయించడం.. పుష్పాలంకరణల ఎగస్ట్రాలు చాలానే జరిగాయి. 

స్థానిక తెలుగుదేశం నాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ 30 ట్రాక్టర్లతో వీరికి అనుకూల ప్రదర్శన కూడా నిర్వహించారు. టిడిపి నాయకుడు అన్నదేవుల చంటి ఆరు టన్నుల పూలను దారి పొడవునా చల్లుతూ ఈ యాత్రకు మద్దతు తెలిపారు. అయితే ఒకరిద్దరు ఇలాంటి పనులు చేసి ఉండొచ్చు కానీ.. ఆదరణ లేని యాత్రకు దారి పొడవునా ఏర్పాట్లు చేయడం తలకు మించిన భారం అని తెలుగుదేశం నాయకులు కుమిలిపోతున్నారు. పార్టీ, పనులు పురమాయిస్తుందే తప్ప ఆర్థికంగా సహకరించడం లేదని వాపోతున్నారు. 

ముందు ముందు విశాఖ శ్రీకాకుళం వరకు వెళ్లేసరికి అసలే పెరిగే వ్యతిరేకతతో పాటు.. యాత్రకు ఏర్పాట్లు చేయడం చాలా కష్టమవుతుందని.. ఆర్థిక భారం ఒకటే కాకుండా ఇతర ఇబ్బందులు కూడా ఉంటాయని టిడిపి నాయకులు భయపడుతున్నారు.