బీజేపీ నుంచి వెళ్లిపోయేందుకు మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణకు ఓ సాకు కావాలి. అధికారం రుచి మరిగిన కన్నా లక్ష్మినారాయణ… అధికారం ఎప్పుడొస్తుందో తెలియని బీజేపీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కనీసం పార్టీలో కీలక పదవి అయినా వుంటే కొనసాగేందుకు ఇష్టపడేవారు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆయన, ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయంగా వెనుకబడ్డారు.
2014లో ఆయన టీడీపీలో చేరాలనుకున్నారు. ఎందుకనో ఆగిపోయారు. బీజేపీలో చేరారు. 2019లో ఎన్నికల సమయంలో వైసీపీలో చేరేందుకు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆయన ఇంటి వద్ద కన్నా, జగన్ ఫొటోలతో వైసీపీ ప్లెక్సీలు కూడా ప్రత్యక్షమయ్యాయి. అయితే రాత్రికి రాత్రి సీన్ మారింది. అమిత్‌షా నుంచి ఫోన్ రావడంతో ఆయన నిర్ణయం మారింది. ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రిలో చేరి, వైసీపీలో చేరికపై డ్రామా నడిపించారు.
ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి దక్కడంతో సంతృప్తి చెందారు. అయితే జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఆయన పెత్తనం మూణ్నాళ్ల ముచ్చటైంది. సోము వీర్రాజు నూతన అధ్యక్షుడు కావడంతో కన్నా లక్ష్మినారాయణ ఉనికి ప్రశ్నార్థకమైంది. పార్టీలో ఉత్సవ విగ్రహం మాదిరిగా కన్నా లక్ష్మినారాయణ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీలో కొనసాగడంపై కొంత కాలంగా ఆయన తర్జనభర్జన పడుతున్నారు.
పార్టీ నుంచి బయటకు వెళ్లాలంటే బలమైన కారణమం కోసం ఎదురు చూస్తున్నారు. వెతుకుతున్న తీగ కాలికి తగిలిన చందంగా, పవన్‌కల్యాణ్ ఎపిసోడ్ కన్నాకు దొరికింది. పొత్తులో తున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌కు బీజేపీకి దూరం కావడానికి సోము వీర్రాజే కారణమని కన్నా లక్ష్మినారాయణ ఘాటైన విమర్శ చేశారు. అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని ఆయన మండిపడ్డారు.
ఇదే సమయంలో భవిష్యత్‌పై చర్చించేందుకు తన అనుచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పవన్ , చంద్రబాబు కలయికపై కన్నా స్పందించడం వెనుక పక్కా ముందస్తు ప్రణాళిక వుందని బీజేపీ అధిష్టానం అనుమానిస్తోంది. టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన చాలా కాలంగా ఆ పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని సమాచారం. జనసేన, టీడీపీ కలిస్తే అధికారానికి తిరుగువుండదని, మంత్రి కావచ్చని ఆయన కలలు కంటున్నారు. ఈ ఉద్దేశంతోనే బీజేపీ నుంచి బయట పడేందుకు ఆయన సొంత పార్టీ రాష్ట్ర చీఫ్‌పై విమర్శలకు దిగారనే చర్చ నడుస్తోంది. నేడో, రేపో భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించే అవకాశం వుంది.