ఫంక్షన్ భారీ-కార్యక్రమాలు సాదాసీదా

సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్.. ఎలా వుంటుంది? అని అడిగితే కళ్లు మూసుకుని చెప్పేయచ్చు. యాంకర్ ఎలా మాట్లాడతారు. ఏం జోకులు వేస్తారు. ఏ పొగడ్తలు కురిపిస్తారు. ఏం కార్యక్రమాలు వుంటాయి. ఇలా అన్నీ.…

సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్.. ఎలా వుంటుంది? అని అడిగితే కళ్లు మూసుకుని చెప్పేయచ్చు. యాంకర్ ఎలా మాట్లాడతారు. ఏం జోకులు వేస్తారు. ఏ పొగడ్తలు కురిపిస్తారు. ఏం కార్యక్రమాలు వుంటాయి. ఇలా అన్నీ. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, భారీ సినిమా కావచ్చు. స్టేజ్ డెకరేషన్, ఎల్ ఇ డి స్క్రీన్ ల సంఖ్య, జనాల హాజరు మాత్రమే మారుతుంది. కానీ కార్యక్రమాల తీరు మాత్రమే మారదు.

భారీ ఫంక్షన్ కు యాంకర్ సుమ ఎంత కామన్ లో అక్కడ జరిగే కార్యక్రమాల తంతు కూడా అంతే కామన్. సినిమా పంక్షన్ లు పరమరొటీన్ గా మారుతున్నాయి అని నిన్నటికి నిన్న జరిగిన సాహో ఫంక్షన్ మరోసారి ప్రూవ్ చేసింది. అంత ఖర్చు సాహో సినిమా కు భారీ ఫంక్షన్ చేసారు. కళ్లు మిరుమిట్లు గొలిపే భారీ ఏర్పాట్లు చేసారు. అంత్యంత భారీ వేదిక. దానికి అటు ఇటు ఎల్ ఇడి స్క్రీన్ లు, ఒకటేమిటి అన్నీ భారీనే.

కానీ కార్యక్రమం మాత్రం ఏమంత హుషారుగా సాగినట్లు అనిపించలేదు. కార్యక్రమంలో రొటీన్ పోగ్రామ్ లే తప్ప, సాహో.. అదిరిందిగా ఈ షో,. అనేట్లు ఒక్కటీలేదు. ప్రారంభంలో పాటల కార్యక్రమం నుంచి ప్రతి ఒక్కటీ కూడా. నిజానికి ఇలా భారీ కార్యక్రమానికి ఏరికోరి, ముంబాయి నుంచో, దేశం నలుమూలల నుంచో మంచి ప్రదర్శనలను ఎంచి ఎంచి తెచ్చి, ఏర్పాటుచేసి వుంటే అదో మచ్చటగా వుండేది.

వేరే పాటలకు డ్యాన్స్ లు చేయించడం వేరు. సాహో లాంటి భారీ సినిమాలోని పాటలకు డ్యాన్స్ లు చేయించడం వేరు. ఢీ పోగ్రామ్ ల్లో పాటలకు చేస్తున్న కొరియోగ్రఫీ ఇతరత్రా వ్యవహారాలు చూస్తే అద్భుతంగా వుంటున్నాయి. కానీ ఇక్కడ స్టేజ్ మీద చేస్తున్న డ్యాన్స్ లు నాసిగా వుంటున్నాయి. సాహో సినిమాల్లో పాటలు ఎలా వుంటాయో, సాంగ్ టీజర్లలో కొద్దిగా చెప్పారు. వాటికి స్టేజ్ ల మీద పెర్ ఫార్మ్ చేయించడం అంటే కాస్త రిస్క్. రాబోయే సినిమా సాంగ్ కాబట్టి ఓ రేంజ్ లో పెర్ ఫార్మ్ చేయాలి.

నిజానికి ఢీలో పాటలు చేసిన వారిని, బహుమతులు పొందిన వారిని తీసుకువచ్చి చేయించినా బాగుండేది. అలాగే కాస్త కనుముక్కు తీరు కూడా బాగుండేవారిని తీసుకురావాల్సి వుంటుంది. చిన్న సినిమాల ఫంక్షన్ లకు అంటే ఖర్చు సమస్య వస్తుంది. కానీ సాహో లాంటి సినిమాలకు అలాంటి సమస్య వుండదు. కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఈ ఫంక్షన్ చేసాము అని ప్రచారం చేసారు. అలాంటపుడు దేశం నలుమూలల నుంచి మాంచి అద్భుతమైన ప్రదర్శనలను తీసుకువచ్చి చేయించి వుంటే మరింత ఆసక్తిగా వుండేది.

ఫంక్షన్ లో ప్రసంగాలను ముక్కలు ముక్కలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. ఎందుకంటే అవి ఆసక్తిగా వుంటాయని. కానీ ఒక్క షోను కూడా కట్ చేసి యూట్యూబ్ లో పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే అద్భుతం అనే షో ఒక్కటీ వుండకపోవడమే.

చప్పగా క్లయిమాక్స్
సాధారణంగా సినిమా ఫంక్షన్ల చివరిలో హీరో లేదా కీలకమైన గెస్ట్ మాట్లాడతారు. అదే హైలైట్ గా వుంటుంది. సాహో ఫంక్షన్  చివరిలో బాహుబలి స్టార్ ప్రభాస్ మాట్లాడారు. కానీ ప్రభాస్ స్పీచ్ ఏమంత అద్భుతంగా, ఆకట్టుకునేలా సాగలేదు. బహుశా సమయాభావం కూడా కావచ్చు. చాలా సాదా సీదాగా మాట్లాడేసి ముగించారు. ఆఖరికి రాజమౌళి, అల్లు అరవింద్ లాంటి వాళ్లను కూడా ప్రభాస్ తన ప్రసంగంలో గుర్తు చేసుకోలేదు.

సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..