కీలక నేతల కోసం ఆన్ స్టాపబుల్ వేట

విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల వాహనాల మీద దాడి చేసిన ఘటనలో పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. ఆరుగురు కీలక నేతల మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినప్పటికీ వారు పరారిలో ఉండడంతో…

విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల వాహనాల మీద దాడి చేసిన ఘటనలో పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. ఆరుగురు కీలక నేతల మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినప్పటికీ వారు పరారిలో ఉండడంతో అరెస్ట్ చేయలేదు. దాంతో వారు ఎక్కడ ఉన్నారు అన్న దాని మీద పోలీసులు తన అన్వేషణను ముమ్మరం చేశారు.

వారిలో కొందరు రాష్త్ట్రం వెలుపల ఉంటున్నట్లుగా చెబుతున్నారు. అందులో విశాఖలో కీలక నేతలుగా ఉన్న వారు, నిత్యం టీవీలలో ఆ పార్టీ తరఫున చర్చా గోష్టిలో ఉన్న వారు ఉన్నారని అంటున్నారు. వీరంతా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

అయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలని చూస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులు రోజా పీఏ దిలీప్, వుడద రజనీ, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ ఉత్తర నియోజకవర్గం నేక కేకే రాజు  ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఇప్పటిదాకా 70 మందిపై కేసు పెట్టి అరెస్ట్ చేస్తే 61 మందికి సొంత పూచీకత్తు మీద బెయిల్ లభించింది. తొమ్మిది మంది మాత్రం రిమాండులో ఉన్నారు. కోర్టు వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించి పోలీస్ కస్టడీకి అనుమతించింది.

ఇక కీలక నేతలుగా భావిస్తున్న ఆరుగురి విషయంలో కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ కేసులో లోతైన విచారణ జరిగి  అసలు వాస్తవాలు బయటకు తెలుస్తాయని అంటున్నారు.