ఓదార్పుయాత్రలు చేసే నాయకులను మనం చూశాం. కానీ.. అందరూ వచ్చి తనను ఓదార్చాలని ఎదురుచూసే నాయకుడిని మనం చూడాలనుకుంటే.. జనసేనాని పవన్ కల్యాణ్ వైపు ఒక లుక్ వేయాల్సిందే. అవునా.. పవన్ కల్యాణ్ ఓదార్పు కోరుకుంటున్నారా? అని విస్తుపోవద్దు. ఆయనకు ఏమైంది.. ఏమైనా యాక్సిడెంట్ గట్రా అయిందా, అనారోగ్యమా అని కూడా కంగారు పడొద్దు. అలాంటివేమీ లేవు.. జస్ట్.. విశాఖలో, శాంతి భద్రతల దృష్ట్యా పబ్లిక్ కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులు నోటీసులు ఇచ్చినందుకు.. ఇప్పుడు అందరూ వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నారు. ఆయన కూడా.. ఇక్కడికేదో.. తనకు మహాచేటు జరిగిపోయినట్టుగా అందరి ఓదార్పునూ కోరుకుంటున్నారు.
నిజానికి ఈ అవకాశం చంద్రబాబునాయుడుకు బాగా కలిసివచ్చింది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ను నేరుగా కలిసి.. బేరం మాట్లాడుకోవడం ఆయనకు తక్షణ అవసరం. ఇందుకు తగిన సమయం, సందర్భం కోసం ఆయన ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగని, చంద్రబాబు వెళ్లి పవన్ కల్యాణ్ తో పుసుక్కున భేటీ కావడం అంత ఈజీగా సాధ్యమయ్యేది కాదు. ఇద్దరూ కూడా సెలబ్రిటీలు. వారు ఎటునుంచి ఎటు తిరుగుతూ ఉన్నా సరే.. వారి మీద ఎంతో కొంత మీడియా నిఘా ఉంటుంది.
చంద్రబాబు లాంటి నాయకుడికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా! ఈ నేపథ్యంలో తాము బేరం మాట్లాడుకోడానికి కాకుండా ఏదో అలా సింపుల్ గా కలిశాం అని బుకాయించేలా భేటీ కావడం జరగదు. ఇలాంటి నేపథ్యంలో విశాఖలో పవన్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం వారికి కలిసి వచ్చింది. అదే ఏదో మహాద్రోహం జరిగినట్టుగా చంద్రబాబు , విజయవాడలోని నొవాటెల్ హోటల్ కు వచ్చి కలిశారు. వారి మధ్య బేరం గురించిన చర్చలు ఎలా జరిగాయనేది ఇదమిత్థంగా చెప్పలేం.
మామూలుగా అయితే.. విశాఖ-పవన్ పరిణామాలను సోము వీర్రాజు పట్టించుకునే వారు కాదు గానీ.. చంద్రబాబు వెళ్లి వచ్చేసరికి ఆయనకు కూడా కాక పుట్టింది. ఏమో పవన్ కు ఏదైనా ఉపద్రవం జరిగినట్టుగా దీనిని భావించాలేమో. వెళ్లి పరామర్శించాలేమో.. అనే అనుమానంతోనే.. తానొక్కడూ వెళ్లి పర్సనల్ గా కలిసి ఓదార్పు యాత్ర చేసి వచ్చారు. పవన్ కల్యాణ్ కు కూడా ఈ ఓదార్పు యాత్రలు మంచి మజా ఇస్తున్నట్లున్నాయి. ఆయన వీటిని మరింతగా కోరుకుంటున్నట్టున్నారు.
విశాఖలో నోటీసులు ఇచ్చినప్పుడే ఆ వ్యవహారాన్ని ఖండించిన వామపక్షాల నాయకులు కూడా నేడో రేపో వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిసి ఓదార్పు యాత్ర నిర్వహించడం గ్యారంటీ. ఓదార్పులో ఉండే రుచి తలకెక్కిందంటే, జాలి పొందడంలో ఉండే స్వీట్ నెస్ మరిగితే కష్టం. అప్పుడిక ‘నాభార్యను నానా మాటలు అన్నారో..’ అంటూ చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటించి ప్రతిచోటా విలపించినట్టుగా.. పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రమంతా తిరిగి.. నా మీటింగులు పెట్టుకోనివ్వలేదు.. నన్ను ఓదార్చండి.. అంటూ అడిగినా ఆశ్చర్యం లేదు. ఎటూ ఆయన రాష్ట్రం తిరగాలనుకుంటున్నారు.
అందులో భాగంగా ప్రతిఊరిలోనూ విశాఖలో నాకు ద్రోహం జరిగింది అంటూ విలపించడం ప్రధాన ఎజెండాగా మారొచ్చు. కాకపోతే.. నన్ను చూసి, నా ప్రజాదరణ చూసి ప్రభుత్వం భయపడిపోతున్నదంటూ పవన్ బిల్డప్ ఇవ్వదలచుకుంటేనే కామెడీ అవుతుంది.