పాతికేళ్ల తర్వాత.. కృష్ణకు సంతోషపు వరద!

భారీ వర్షాలు కర్ణాటకలోని కొంత ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. అదే రాష్ట్ర పరిధిలో మరోవైపు పడుతున్న వానలు తెలుగు రాష్ట్రాలకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి. అక్కడ వర్షం ఇక్కడ వరదగా మారి రైతులకు…

భారీ వర్షాలు కర్ణాటకలోని కొంత ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. అదే రాష్ట్ర పరిధిలో మరోవైపు పడుతున్న వానలు తెలుగు రాష్ట్రాలకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి. అక్కడ వర్షం ఇక్కడ వరదగా మారి రైతులకు భరోసాను ఇస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే అదే గగనం అన్నట్టుగా ఉండే పరిస్థితి. ప్రతియేటా అలాగే నడుస్తూ వచ్చింది కథ. అయితే ఈసారి శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్‌ పొంగింది! జూలై చివర్లో మొదలైన వరద, పక్షంరోజుల్లో మొత్తం ప్రాజెక్టులను నింపేసింది.

దేశంలో కృష్ణానదిపై అత్యంత భారీ సాగునీటి, బహుళార్ధకసాధక ప్రాజెక్టులు ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు లభ్యంకావడం రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆనందకరమైన అంశం.

అయితే ఈ ప్రాజెక్టులు అన్నీ నిండి భారీ ఎత్తున కడలి వైపు కృష్ణమ్మ సాగిపోతూ ఉంది. సముద్రంలోకి నీరు కలుస్తున్నాయని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే సముద్రానికి కూడా నీళ్లు అవసరమే. జీవవైవిధ్యంలో సముద్రానికి నీళ్లు వెళ్లాల్సిన అవసరం ఉంది. సముద్రాలను మనుషులే కలుషితం చేస్తూ ఉన్నారు. అలాంటి చోటికి స్వచ్ఛమైన జలాలు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది.

అయితే మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులు  ఉండి ఉండే కడలి వైపు సాగే నీరు కూడా సద్వినియోగం అయ్యేదని కొంతమంది వాదన. అదీ నిజమే. దానికి మరింత కసరత్తు చేయాలి. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుంచినే ఇలాంటి సమయంలో నీటిని మరింతగా రాయలసీమ వైపు పంపితే, ఆ ప్రాంతానికి మరింత మేలు జరిగేది. అయితే ఇప్పుడు మరీ అన్యాయం జరుగుతున్నది ఏమీలేదు.

వరద సమయంలోనే రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కూడా నీరు సాగుతూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట మట్టానికి నీటి లభ్యత ఉండనే ఉంటుంది. అందులో కూడా రాయలసీమ వాటా మేరకు నీటిని అందిస్తే ఆ ప్రాంతానికి మరింత మేలు జరుగుతుంది.

వరద సమయంలో టీఎంసీల లెక్కలు, వాటాలు వేయకుండా వరదానంతరం కరువు ప్రాంతానికి మరికొంచెం ప్రాధాన్యతను ఇవ్వాలి ప్రభుత్వం. అప్పుడే సమన్యాయం జరుగుతుంది.
-ఎల్‌.విజయలక్ష్మి

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?