సినిమా రివ్యూ: పెంగ్విన్

చిత్రం: పెంగ్విన్ రేటింగ్: 2.5/5 బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిలింస్, ప్యాషన్ స్టూడియోస్ తారాగణం: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, మధి, నిత్య కృప తదితరులు సంగీతం: సంతోష్ నారాయణ్…

చిత్రం: పెంగ్విన్
రేటింగ్: 2.5/5
బ్యానర్:
స్టోన్ బెంచ్ ఫిలింస్, ప్యాషన్ స్టూడియోస్
తారాగణం: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, మధి, నిత్య కృప తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణ్
కూర్పు: అనిల్ క్రిష్
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
నిర్మాతలు: కార్తీక్ సుబ్బరాజ్, కారిే్తకయన్ సంతానం, సుధాన్ సుందరం, జయరాం
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
విడుదల తేదీ: జూన్ 19, 2020
వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో

డైరెక్ట్ టు ఓటిటి రిలీజ్ ప్రకటించిన చిత్రాల్లో అమితంగా ఆకట్టుకున్న సినిమా పెంగ్విన్. కీర్తి సురేష్ (మహానటి) హీరోయిన్, కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా, జిగర్తాండ) ప్రొడ్యూసర్ కావడంతో ఈ చిత్రానికి థియేట్రికల్ అప్పీల్ చాలా ఎక్కువ. అయినప్పటికీ ఓటిటి వేదికగా విడుదల అనౌన్స్ చేయడమే కాకుండా, ఆకట్టుకునే ప్రోమోస్‌తో ‘పెంగ్విన్’ తప్పక చూడాల్సిన చిత్రమనే భావన కలిగించారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్. 

ఆరేళ్ల తర్వాత కూడా తన కొడుకుని పోగొట్టుకున్న జ్ఞాపకం రిథమ్‌ని (కీర్తి) వెంటాడుతూ వుంటుంది. భర్తతో (లింగా) విడిపోయి, మరొకరిని (రంగనాధ్) వివాహం చేసుకున్న రిథమ్ ఇప్పుడు ఏడు నెలల గర్భవతి. తన కొడుకు కనిపించకుండా పోయిన సరస్సు దగ్గరకు వెళ్లి అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే ఓ అద్భుతంలా ఆమెకి కొడుకు మళ్లీ దొరుకుతాడు. కానీ విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఆ పిల్లాడిని ఎవరు తీసుకుపోయారు? ఎందుకు తీసుకు వెళ్లారు అనే ప్రశ్నలు ఆమెని తొలిచేస్తుంటాయి. కనిపించకుండా పోయిన మరో పాప ఆచూకీ తెలుసుకునే క్రమంలో రిథమ్‌కి ఎవరు ఎదురుపడతారు? తనకి అంతటి క్షోభని కలిగించినదెవరు? 

స్ట్రయికింగ్ విజువల్స్ (కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ హైలైట్), టెన్షన్ బిల్డ్ చేసే స్కోర్ (సంతోష్ నారాయణ్ మ్యూజిక్ పెంగ్విన్‌లోని పలు థ్రిల్లింగ్ మూమెంట్స్‌లో ఆ మూడ్ ఎలివేట్ చేస్తుంది)… మొదటి సన్నివేశంలోనే ‘పెంగ్విన్’ వీక్షకులని అరెస్ట్ చేసేస్తుంది. బ్లూయిష్ టింట్‌లో… ఎల్లో, రెడ్ లాంటి వైబ్రెంట్ కలర్స్‌తో ఇన్‌స్టంట్‌గా అరెస్ట్ చేసే విజువల్స్‌కి తోడు భయానకమయిన ఆ మొదటి సన్నివేశం ‘పెంగ్విన్’కి పర్‌ఫెక్ట్ టోన్ సెట్ చేస్తుంది. ప్రథమార్ధం అంతటిలోను పలు ఉత్కంఠభరిత సన్నివేశాలు, టెన్షన్‌ని రెట్టించే సంఘటనలు ‘ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఇస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ షాక్ ఇవ్వడంతో పాటు మంచి హై కూడా ఇస్తుంది. కానీ ఆ తర్వాత అదే టోన్ మెయింటైన్ చేయడంలో ఈ చిత్రం విఫలమయింది. 

తన పిల్లాడ్ని ఎవరు తీసుకెళ్లారు అనే ప్రశ్నకి సమాధానాలు వెతుకుతోన్న క్రమంలో రిథమ్‌కి తన మాజీ, ప్రస్తుత భర్తలపై కూడా అనుమానం కలిగించేలా, తద్వారా ప్రేక్షకులని డైవర్ట్ చేసేలా దర్శకుడు కొన్ని సీన్స్ క్రియేట్ చేసాడు. కానీ వాటి వల్ల కథకి కలిగిన ప్రయోజనం ఏమీ లేదు. పిల్లల్ని ఎతుె్తకళ్లి, దారుణంగా హతమారుస్తున్న సైకో జాడ తెలుసుకునే సన్నివేశాలు, ఆ తర్వాత అతనితో పోలీస్ ఇంటరాగేషన్ రూమ్‌లో జరిగే ముఖాముఖి లాంటివి అంతకుముందు వరకు రేకెత్తించిన ఆసక్తిని జస్టిఫై చేసే కన్‌క్లూజన్ ఇచ్చినట్టు అనిపించవు. సుదీర్ఘంగా సాగే వారిద్దరి ప్రశ్నల గేమ్ పాయింట్‌లెస్‌గా, ఇల్లాజికల్‌గా అనిపిస్తుంది. 

ఇక పిల్లాడు కనిపించకుండా పోయిన దానికి దొరికే సమాధానం పలు చిత్రాలలో పలుమార్లు చూసేసిన కారణం కావడంతో ఆ కాస్త ఆసక్తి కూడా సన్నగిల్లిపోతుంది. చక్కని బిల్డప్‌తో, చాలా ఎంగేజ్ చేసే ఫస్ట్‌హాఫ్‌తో ఆకట్టుకున్న పెంగ్విన్… సెకండ్ హాఫ్ సిండ్రోమ్‌తో సగటు సినిమాగా ఎండ్ అవుతుంది. కీర్తి సురేష్ అభినయం, నిండు గర్భవతి అయిన రిథమ్ పలు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవడం లాంటివి ఈ చిత్రం పట్ల ఇంట్రెస్ట్ పూర్తిగా సడలిపోకుండా ెల్డ్ చేస్తాయి. ‘కహానీ’లో విద్యాబాలన్ మాదిరిగా ప్రెగ్నెంట్ క్యారెక్టర్‌ని డేంజరెస్ సిట్యువేషన్స్‌లోకి తీసుకెళ్లడమనే టెక్నిక్ కొన్ని థ్రిల్లింగ్ ఎపిసోడ్స్‌కి హెల్ప్ అయింది. 

అయితే ఎలాంటి సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ ఉన్న చిత్రానికయినా ‘మోటివ్’ దగ్గరే మార్కులు పడతాయి. అంతవరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసిన ప్రశ్నలకి వారికి కన్విన్సింగ్ సమాధానాలు ఇవ్వాలి. లేదంటే అంతవరకు ఎంత ఎంగేజ్ చేసినా కానీ ఒక్కసారిగా నిరుత్సాహం వచ్చేస్తుంది. పిజ్జాలాంటి షాకింగ్ ఫైనల్ వున్న థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమయిన కార్తీక్ సుబ్బరాజ్ ఇలాంటి ఒక ఆర్డినరీ ఫైనల్ ఉన్న కథను యాక్సెప్ట్ చేసి, ఫండ్ చేయడం ఆశ్చర్యపరుస్తుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు పాటించిన పెంగ్విన్ చిత్రానికి కీర్తి సురేష్ పర్‌ఫార్మెన్స్ ప్రధానాకర్షణ. బిడ్డను పోగొట్టుకుని ఆ యాతన అనుభవించే తల్లిగా, తన బిడ్డకు అలాంటి స్థితిని కలిగించినదెవరు అని కనుక్కోవడం కోసం తపించే మాతృమూర్తిగా ఆమె అభినయం చాలా ఎఫెక్టివ్‌గా, బిలీవబుల్‌గా వుంది. కానీ పర్‌ఫార్మెన్స్ పరంగా మిగిలిన నటులు ఎవరి గురించీ అలా చెప్పుకోవడానికి లేదు. 

సపోర్టింగ్ కాస్ట్ అంతా అండర్ రిటెన్ క్యారెక్టర్స్‌తో ఎలాంటి ఇంపాక్ట్ వేయలేకపోయారు. మాస్టర్ అద్వైత్ మాత్రం రెండు సన్నివేశాల్లో సీన్‌కి కావాల్సిన థ్రిల్ తీసుకురాగలిగాడు. థియేటర్స్ కోసం తీసిన సినిమానే అయినా కానీ ఈ సపోర్టింగ్ కాస్ట్ వల్ల డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోసం చేసిన చిత్రమనే ఫీలింగ్ ఇస్తుంది. థియేట్రికల్ రిలీజ్ అయితే ‘డిజప్పాయింట్‌మెంట్’ లెవల్స్ ఇంకాస్త ఎక్కువే వుంటాయి కానీ… ఇంట్లో కూర్చుని చూసే వీలుంది కనుక ‘పెంగ్విన్’ ఓవరాల్‌గా ఓకే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. థర్డ్ యాక్ట్‌పై రైటింగ్ టేబుల్ వద్ద కాస్త ఎఫర్ట్ పెట్టినట్టయితే ఈ చిత్రం ఖచ్చితంగా గుడ్ థ్రిల్లర్ అనిపించుకుని వుండేది. రాచ్చసన్, సైకో లాంటి ఎఫెక్టివ్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ చూసిన తర్వాత ఈ పెంగ్విన్ పిట్ట ఘనం, కూత కొంచెం సినిమాగా మిగిలిపోయింది. 

బాటమ్ లైన్: సెకండ్ హాఫ్ సిండ్రోమ్! 

గణేష్ రావూరి