అన్నీ ఓకే…అదొక్క‌టే జ‌గ‌న్‌పై అసంతృప్తి!

రైతుల‌న్నా, వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ‌న్నా దివంగ‌త వైఎస్సార్‌, ఆయ‌న కుటుంబానికి ఎంతో ప్రేమ. ఈ విష‌యంలో రెండో అభిప్రాయానికే చోటు లేదు. రాయ‌ల‌సీమను క‌ర‌వు ర‌క్క‌సి నుంచి విముక్తి చేయాల‌ని వైఎస్సార్ ఎంతో త‌పించారు. ఈ…

రైతుల‌న్నా, వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ‌న్నా దివంగ‌త వైఎస్సార్‌, ఆయ‌న కుటుంబానికి ఎంతో ప్రేమ. ఈ విష‌యంలో రెండో అభిప్రాయానికే చోటు లేదు. రాయ‌ల‌సీమను క‌ర‌వు ర‌క్క‌సి నుంచి విముక్తి చేయాల‌ని వైఎస్సార్ ఎంతో త‌పించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అధికారంలోకి రాగానే కొన్ని సాగునీటి ప్రాజెక్టులు చేప‌ట్ట‌డంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామర్థ్యాన్ని 11500 క్యూసెక్కుల నుంచి 40,000 క్యూసెక్కులకు పెంచారు.

ఇది రాయ‌ల‌సీమ పాలిట వ‌ర‌ప్ర‌సాద‌మైంది. దీనికి కొనసాగింపుగా అన్న‌ట్టు వైఎస్సార్ త‌న‌యుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సీమ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే ప్రాజెక్టును చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. సీమ‌కు నీళ్లు అందించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఢీకొనేందుకు కూడా ఆయ‌న వెన‌కాడ‌డం లేదు.

శ్రీ‌బాగ్ ఒప్పందం ప్ర‌కారం రాయ‌ల‌సీమ‌కు రాజ‌ధాని లేదా హైకోర్టు ఇవ్వాలి. ఏపీ విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డంతో రాయ‌ల‌సీమ ఆకాంక్ష‌ల‌కు పాత‌రేశారు. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి రాగానే సీమ ఆకాంక్ష‌ల‌కు ప్రాణం పోశారు. క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు చ‌ట్టం కూడా తీసుకొచ్చారు. అయితే ఈ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం హైకోర్టులో ఉంది. ఇదిలా ఉండ‌గా గ‌త రెండురోజులుగా ఏపీలో చోటు చేసుకున్న ప‌రిణామాలు సీమ‌కు అనుకూలంగా ఉన్నాయి.

క‌ర్నూలులో మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌, అలాగే లోకాయుక్త ఏర్పాటుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో క‌ర్నూలులో లోకాయుక్త కార్యాల‌యాన్ని శ‌నివారం ప్రారంభించి ప్ర‌భుత్వం త‌న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేసింది. ఒక‌వైపు లోకాయుక్త కార్యాల‌యాల‌కు త‌గిన వ‌స‌తి కోసం వెతుకుతూనే, ఆక‌స్మికంగా తాత్కాలిక ఏర్పాటుతో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇంత వ‌ర‌కూ జ‌గ‌న్‌ను సీమ స‌మాజం మెచ్చుకుంటోంది. అయితే జ‌గ‌న్‌పై అసంతృప్తి క‌లిగించే మ‌రో అంశం ఉంది.

అది కృష్ణా రివ‌ర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు అంశం. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీన్ని కూడా విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం ఈ బోర్డు హైద‌రాబాద్‌లో ఉంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఈ కార్యాల‌యాన్ని ఏపీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ కార్యాల‌యాన్ని కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంతో సంబంధం లేకుండా విశాఖ‌లో ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌ద‌మైంది. దీనిపై అన్ని వైపుల నుంచి జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

కేఆర్ఎంబీ కార్యాల‌యాన్ని రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాల‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ‌స్తోంది. విశాఖ‌లో ఏర్పాటును ఏపీ స‌మాజం మాత్ర‌మే కాదు, తెలంగాణ ప్ర‌భుత్వం కూడా వ్య‌తిరేకిస్తోంది. కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో కాకుండా, అస‌లు ఏ మాత్రం సంబంధం లేని ఇత‌ర ప్రాంతంలో బోర్డు ఏర్పాటుకు అంగీక‌రించేది లేద‌ని ఇప్ప‌టికే తెలంగాణ స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. 

అన‌వ‌స‌ర పంతాలు, పట్టింపుల‌కు వెళ్ల‌కుండా కృష్ణా న‌ది ప్ర‌వ‌హిస్తున్న రాయ‌ల‌సీమ‌లో ఆ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం పున‌రాలోచించాలి. మొండి ప‌ట్టుద‌ల‌కు పోయి …విశాఖ‌లోనే కేఆర్ఎంబీ ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యిస్తే మాత్రం… సీమ స‌మాజానికి చేసిన మంచి అంతా పోతుంద‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.