ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో రాజీనామా చేయగానే అక్కడ ఉప ఎన్నిక వచ్చేసిందన్న భావనతో సీఎం కేసీఆర్ కొత్త పథకాన్ని సృష్టించేశారు. దాని పేరే దళితబంధు. హుజూరాబాద్ లో అధికంగా ఉన్న దళితుల ఓట్ల కోసం దాన్ని ఎలా ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం.
జనాలకు, మీడియాకు తెలిసి దళితబంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే పుట్టింది. కానీ కేసీఆర్ తనకు ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉందని, దాని అమలుకు ఇప్పడు టైం వచ్చిందని చెబుతున్నారు. ఒకప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గంలో దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమం అమలు చేశానని చెబుతున్నారు.
అసలు దళిత బంధు ఏడాది కిందటే అమలు చేయాలని అనుకున్నానని, కానీ కరోనా మహమ్మారి కారణంగా అమలు చేయలేకపోయానని అంటున్నారు. అంటే ఉప ఎన్నిక కోసమే ఈ పథకం తేలేదని, ఓట్లు వేయించుకోవడానికి కాదని, నిజంగా దళితుల మేలు కోసమే తెచ్చానని చెప్పడమన్న మాట.
నిన్న కరీంనగర్లో దళితబంధు మీద సమీక్ష నిర్వహించిన కేసీఆర్ దళితుల కోసం తన రక్తం ధారపోస్తానన్నారు. కానీ ఆయన దళితుల గురించి ఇంత తపనతో, ఆవేదనతో మాట్లాడిన దాఖలాలు గత ఏడేళ్లలో ఎప్పుడూ చూడలేదు. అందుకే కేసీఆర్ మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తెలంగాణా రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, తాను కాపలా కుక్కలాగా ఉంటానని అన్నారు. ఆ పని చేయకుండా కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేయకుండా చూడటానికే తాను సీఎం అయ్యానన్నారు.
దళితుడైన డాక్టర్ రాజయ్యను మంత్రి పదవి నుంచి పీకేశారు. ఇప్పటివరకు సరైన కారణం తెలియదు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నారు. ఇవ్వలేదు. కానీ ఇప్పుడు దళిత మంత్రం జపిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దళితబంధు పథకం లక్ష్యం నెరవేరాలన్నదే తన ఉద్దేశ్యమని. ఇందులో భేషజాలు ఉండవని నిన్న కరీంనగర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం అన్నారు.
దళితులు ఆర్థిక అబివృద్ధి చెందినప్పుడే పథకం ముఖ్య ఉద్దేశ్యం నెరవేరినట్టవుతుందని సీఎం అన్నారు. తాను బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత రాసిన ఓ పుస్తకం చదివి దళితుల అభ్యున్నతి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుందోనన్న విషయంపై స్పష్టత తెచ్చుకున్నానని చెప్పారు. కానీ ఈ పుస్తకం ఏమిటో, రచయిత ఎవరో చెప్పలేదు.
మంత్రులు, నాయకులు దళితబంధు గురించి ప్రచారం చేయాలిగానీ ఆ వివరాలన్నీ వాళ్లకు ఎందుకు అనుకున్నారేమో. దళితబంధు పుట్టుక వెనుక ఉన్న ఈ కథ కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు. దళిత బందును సమర్ధించుకోవడానికి నానా తిప్పలు పడుతున్న విషయం అర్ధమవుతోంది.