ఈ మధ్య తెలుగు దేశం నాయకులు రూట్ మార్చేశారు. కొత్త మాటలు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మేమే వస్తామని చెప్పడం పాతబడిపోయింది. ఇక దాన్ని కాస్తా మార్చేసి మేమే రాబోతున్నాం, అందరి జాతకాలూ బయటకు తీస్తాం, లెక్కలు తేలుస్తామంటూ మైండ్ గేమ్ కొత్తగా మొదలెట్టేశారు.
చోటా నాయకుడి నుంచి బడా నేత దాకా ప్రతీ వారి నోటి వెంట ఇవే ఆణిముత్యాలు జాలువారుతున్నాయి. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే ఆ మధ్య అరెస్ట్ అయినపుడు రాబోయే కాలానికి తానే కొత్త హోమ్ మంత్రిని అని పోలీసుల మీద గట్టిగా మాట్లాడారు. ఇపుడు కూడా ఆయన ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 155 సీట్లు వస్తాయని ఆయన అంటున్నారు. ఇక వచ్చేది తామే కాబట్టి అందరి విషయాలు చూస్తామని హెచ్చరిస్తున్నారు. రానున్నది తమ ప్రభుత్వమే అని చెప్పడానికి ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పి మరీ రక్తి కట్టించారు.
ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా సర్పంచు సీట్లు గెలుచుకుంటే దాన్ని కూడా ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ఈ సర్పంచు పదవులు ఎవరికి కావాలి అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే సీట్లు మాత్రమే కావాలి. అక్కడే తమ గెలుపు అంటూ గర్జిస్తున్న అచ్చెన్న చంద్రబాబుని మించే రీతిలోనే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరో సారి పోలీసుల మీద కూడా విరుచుకుపడుతున్నారు.
ఎన్ని చేసినా కూడా ఇంకా రెండున్నరేళ్ళు గడవాలి కదా అచ్చెన్నా అంటున్నారు వైసీపీ నేతలు. మరి ఇది తెలుగు తమ్ముళ్ళ అతి ధీమావా లేక ఫస్ట్రేషనా. లేక పార్టీ వారి కోసం చెప్పే ఊరట మాటలా అన్నది వేచి చూడాల్సిందే.