ఎల్లో మీడియా భాషకు అర్థాలే వేరులే!

ఎక్క‌డైనా న్యాయం ఒకేటా వుంటుంది. అదేంటోగానీ, ఎల్లో మీడియా మాత్రం తాము చెప్పిందే న్యాయం, చేసిందే శిలాశాస‌నం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ ప‌రిధిలో మంత్రులు, వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రాళ్లతో దాడికి…

ఎక్క‌డైనా న్యాయం ఒకేటా వుంటుంది. అదేంటోగానీ, ఎల్లో మీడియా మాత్రం తాము చెప్పిందే న్యాయం, చేసిందే శిలాశాస‌నం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ ప‌రిధిలో మంత్రులు, వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రాళ్లతో దాడికి దిగితే మాత్రం నిర‌స‌న‌, సెగ‌గా అభివ‌ర్ణించాయి. తాజాగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం న‌గ‌రంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు మూడు రాజ‌ధానులు కావాల‌ని నిన‌దిస్తే ఎల్లో మీడియా కంటికి దుశ్చ‌ర్య‌గా క‌నిపిస్తోంది.

ఎల్లో మీడియా భాష‌కు అర్థాలే వేరులే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వెల్లి వ‌ర‌కూ అమ‌రావ‌తి పాద‌యాత్ర‌-2 ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌కు ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని వ‌ద్ద‌ని పాద‌యాత్ర చేయ‌డం అంటే… దండ‌యాత్రే అని మిగిలిన ప్రాంతాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. త‌మ ప్రాంతం పైకి దండ‌యాత్ర‌గా వ‌స్తున్న పాద‌యాత్ర‌కు స‌హ‌జంగానే మార్గ‌మ‌ధ్యంలో వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది.

అమ‌రావ‌తే రాజ‌ధాని అని హైకోర్టు ప్ర‌క‌టించిన త‌ర్వాత పాద‌యాత్ర చేప‌ట్టాల్సిన అవ‌స‌రం లేకున్నా, రెచ్చ‌గొట్టేందుకు బ‌య‌ల్దేరార‌నే విమ‌ర్శ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ‌ను రెచ్చ‌గొట్ట‌డానికి వ‌స్తున్న అమ‌రావ‌తి పాద‌యాత్రికులకు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర‌స‌న త‌గిలింది. 

ఆజాద్ చౌక్ మీదుగా వెళుతున్న వారికి న‌ల్ల‌బెలూన్లు చూపుతూ, వాట‌ర్ బాటిళ్లు విసురుతూ వైసీపీ నేత‌లు దుశ్చ‌ర్య‌కు దిగార‌ని ఎల్లో మీడియా గ‌గ్గోలు పెడుతోంది. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రెచ్చ‌గొట్ట‌డంతోనే వారు పాద‌యాత్రికుల‌పై వాట‌ర్ బాటిళ్లు విసిరార‌ని ఎల్లో మీడియా కోడై కూస్తోంది.

ఇదే ఉత్త‌రాంధ్ర ఆకాంక్ష‌ను చాటి చెప్పేందుకు గ‌ర్జించిన విశాఖ‌పై అల్ల‌రి మూక దాడిని ఎలా అర్థం చేసుకోవాలి? మంత్రులపై దాడిని కూడా ప‌క్క‌దారి ప‌ట్టించిన వైనాన్ని చూశాం. పైగా రాళ్లు, క‌ర్ర‌ల‌తో హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన వారిపై కేసులు న‌మోదు చేయ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. మంత్రులు, వైసీపీ నేత‌ల‌పై దాడి లోక‌క‌ల్యాణార్థం అనే రీతిలో ఎల్లో మీడియా త‌న నైజాన్ని ప్ర‌ద‌ర్శించింది. 

ఇప్పుడు వాట‌ర్ బాటిళ్లు విస‌ర‌గానే… దుశ్చ‌ర్య‌, అనాగ‌రికం, దుర్మార్గం అంటూ ఎల్లో మీడియా త‌న‌దైన భాష‌ను ప్ర‌త్య‌ర్థుల‌పై ప్ర‌యోగిస్తోంది. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అనే రీతిలో జిమ్మిక్కులు చేయ‌డం వారికే చెల్లింది.