మొన్న రేవంత్ హీరో.. నిన్న చంద్రబాబు హీరో..!

వారిది మా స్థాయి కాదు, వారి ప్రస్తావన కూడా అవసరం లేదు అంటూనే.. టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని, చంద్రబాబుని హీరోలుగా మార్చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసి, ఆయనను సోనియా…

వారిది మా స్థాయి కాదు, వారి ప్రస్తావన కూడా అవసరం లేదు అంటూనే.. టీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని, చంద్రబాబుని హీరోలుగా మార్చేస్తున్నారు. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసి, ఆయనను సోనియా గాంధీ దగ్గర హీరోని చేసిన టీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాబు ప్రస్తావన అనవసరంగా తెచ్చారు. 

చచ్చిపోయిన చాముని చంపే ప్రక్రియలో తమ స్థాయి దిగజార్చుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ని చంద్రబాబు, తన ఫ్రాంచైజీగా తీసుకున్నారని, తెలంగాణ రాజకీయాలను బాబు ప్రభావితం చేస్తున్నారని లేనిపోని ఆందోళన పడుతున్నారు. అధికారంలోకి రాకముందు, అధికారం చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ కి విమర్శలు కొత్తేం కాదు, కానీ వాటిపై స్పందించే తీరులో మాత్రం ఇప్పుడు మార్పు బాగా వచ్చింది. 

రేవంత్ రెడ్డికి తెలంగాణలో క్రెడిబిలిటీ ఉందని ఎవరూ అనుకోరు. ఓటుకు కోట్లు కేసులో ఆయన పరువు పూర్తిగా గంగలో కలిసిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ కి ఎవరూ దిక్కులేకపోవడంతో.. తనకున్న లాబీయింగ్ తో రేవంత్ పీసీసీ స్థానం దక్కించుకున్నారు, ఆ ఊపులో ఎగిరెగిరి పడుతున్నారు.

మీడియా అండతో..

విశేషం ఏంటంటే.. మీడియా రేవంత్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. చంద్రబాబు నుంచి మీడియా మేనేజ్ మెంట్ బాగా నేర్చుకున్న రేవంత్.. తనకు పదవి వచ్చీ రాగానే మీడియా పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం నుంచి అన్ని కార్యక్రమాలను హైలెట్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలో దళితబంధుని విమర్శిస్తూ పెట్టిన దళిత, గిరిజన దండోరా యాత్రలకు పబ్లిసిటీ బాగా వచ్చింది. దీంతో రేవంత్ మరింతగా రెచ్చిపోయారు. కేసీఆర్ ని కూడా లెక్కలేకుండా, లక్ష్యపెట్టకుండా మాట్లాడారు.

టీఆర్ఎస్ ఆ విమర్శలను పట్టించుకోకుండా ఉంటే, రేవంత్ ఫెయిలయ్యేవారు. కానీ టీఆర్ఎస్ రేవంత్ ఉచ్చులో పడింది. ఆ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిపై ఏకంగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. పదవిచ్చిన రోజుల వ్యవధిలోనే.. తెలంగాణలో రేవంత్ రచ్చ చేస్తున్నారనే సంకేతాలు పంపారు. రేవంత్ కి అది ఎంతమాత్రం నెగెటివ్ కాదు, కాంగ్రెస్ దృష్టిలో ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది. ఒకరకంగా టీఆర్ఎస్ రేవంత్ ని హీరో చేస్తోంది.

తెలియకుండానే హీరోల్ని చేస్తున్నారు

అక్కడితో ఆగకుండా కేటీఆర్.. చంద్రబాబు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. రేవంత్ బాబు మనిషి అని, తెలంగాణలో కాంగ్రెస్ ని చంద్రబాబు ఫ్రాంచైజీగా తీసుకున్నారని అన్నారు. అసలు తెలంగాణలో టీడీపీనే నామరూపాల్లేకుండా పోయింది. 

ఇలాంటి స్థితిలో ఉన్న బాబు, కాంగ్రెస్ రాజకీయాలను ప్రభావితం చేయగలరా..? ఈ విషయం తెలిసి కూడా బాబుని తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొచ్చి పరోక్షంగా ఆయన్ను హైలెట్ చేశారు కేటీఆర్. ఒకప్పుడు కేసీఆర్, కేటీఆర్.. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగినోళ్లే కదా అని రేవంత్ సెటైర్ పేల్చడంతో టీఆర్ఎస్ నేతలు చిన్నబుచ్చుకుంటున్నారు.

చంద్రబాబుని తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరచిపోయారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ బేస్ దొరికింది కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఆయన కూడా బాబు బినామీగా చరిత్రలో కలసిపోయేవారు. ఇక టీఆర్ఎస్ మాత్రం వీళ్ల తాటాకు చప్పుళ్లకు భయపడటమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి ఎపిసోడ్ తో టీఆర్ఎస్ ఇరుకునపడినట్టవుతోంది.

అవినీతి ఆరోపణలు రాగానే ఈటలను బర్తరఫ్ చేసిన కేసీఆర్, అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డిని ఎందుకు పదవిలో ఉంచారని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. దాన్ని కవర్ చేసుకోలేక, చివరకు కేటీఆర్ రంగంలోకి దిగి.. చంద్రబాబుని కూడా సీన్ లోకి తెచ్చారు. భయపడేది లేదంటూనే.. వైరి వర్గాల భజన చేస్తున్నారు.