సినిమా వాళ్లకి “నేను-నాది” అనే ఇగో చాలా ఎక్కువగా ఉంటుందంటారు. ముఖ్యంగా కథానాయకుల విషయంలో ఇది బాగా ఎక్కువ అని టాక్. పవన్ కల్యాణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పవన్ వైఖరిలో మార్పు లేదు. అయితే అప్పుడప్పుడు మాత్రమే ఈ రెండో వ్యక్తి ఇలా బైటకొచ్చి అలా వెళ్లిపోతుంటాడు. తాజాగా జరిగిన ఓ మీటింగ్ లో కూడా పవన్ తనదైన శైలిలో నేను, నాది అంటూ స్పందించారు.
సోషల్ మీడియాలో కొంతమంది అసంతృప్తులు బహిరంగంగా పార్టీ విధానాలను విమర్శిస్తూ పెడుతున్న పోస్టులపై పవన్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి బెదిరింపులకు భయపడి తానేమీ వారిని బుజ్జగించబోనని స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని క్లాస్ తీసుకున్నారు. అదే సమయంలో కొంతమంది తమ చుట్టూ తిరుగుతున్న జనసైనికుల్ని చూసి అది తమ బలమే అనుకుంటున్నారని, అది వారి బలం కాదని, అది పవన్ కల్యాణ్ బలం అని, పవన్ భావజాలం ద్వారా వచ్చిన బలం అని గుర్తుంచుకోవాలని కాస్త గట్టిగానే హెచ్చరించారు.
అసంతృప్తులను బుజ్జగించకుండా ఇలా పరోక్షంగా హెచ్చరించడం మంచిదే, అదే సమయంలో అది మిగతావారికి నొప్పి కలిగించకూడదు. పార్టీని నమ్ముకుని, కష్టపడి పార్టీ కోసమే పని చేసేవారికి ఇలాంటి మాటలు రుచించవు. అన్నీ వదులుకొని పార్టీలోకి వస్తే.. తమను గుర్తించలేదనే బాధ ఓవైపు, నేను లేకపోతే మీరు జీరో అనే కామెంట్లు మరోవైపు కచ్చితంగా నిజమైన నాయకులు, కార్యకర్తలకు బాధ కలిగిస్తాయి.
పోనీ జనసేన బలం అంతా పవన్ కల్యాణ్ దే అనుకుందాం. అలాంటప్పుడు రెండు చోట్ల పవన్ ఎందుకు ఓడిపోయినట్టు. ఇలా తనని తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోబట్టే పవన్ కల్యాణ్ చతికిలపడ్డారనే విషయం బహిరంగ రహస్యం. ఆ రహస్యాన్ని ఫలితాల తర్వాత కూడా తెలుసుకోకుండా పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన కాన్ఫిడెన్స్ అనాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా తగ్గలేదనుకోవాలా అర్థం కావడంలేదు.
అంతా నేనే, అన్నీ నేనే అనుకుంటున్నారు జనసేనాని. ఇలాంటి డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో మాత్రం కాస్త పరిణితితో ఆలోచించడం మంచిది. పాతికేళ్ల రాజకీయం అంటే.. పార్టీని కాపాడుకోవడం కూడా. జనసేనాని ఇది ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇలాంటి మాటలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.