టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గత కొంత కాలంగా రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలతో చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి అభ్యంతరకర భాషపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని కేటీఆర్ తప్పు పట్టారు. పలికెడు వాడు రేవంత్ అయినప్పటికీ, పలికించెడు వాడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. రేవంత్‌ది పరాయి పలుకని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక చంద్రబాబునాయుడు తొత్తు, డబ్బు సంచులతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని పట్టుకుని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసుకున్నారని విమర్శించారు.
ఈ రోజు అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి మీద పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. మరి మేం ఏమనాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిపై నోరు జారితే కేంద్రమంత్రి అని చూడకుండా లోపల పడేశారన్నారు. తమను కూడా అదే పని చేయమంటే చేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకంతో రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.