మాజీ వివేకా హత్య కేసు విచారణ టీవీ సీరియల్లా కొనసాగుతూనే వుంది. దానికి ముగింపు ఎప్పుడో ఎవరికీ తెలియని స్థితి. ఒకదాని తర్వాత మరొకటి ముందుకొస్తూ, కేసు విచారణను వెనక్కి నెడుతున్నాయి. ఈ కేసు విచారణను తెలంగాణకు మార్చాలని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రస్తుతం విచారణ సాగుతోంది.
ఇదిలా వుండగా వివేకా హత్య కేసులో ముఖ్య నిందితుడైన ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై పులివెందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్వేచ్ఛగా, నిర్భయంగా ఆయన పులివెందుల వీధుల్లో సంచరిస్తున్నారు. వైఎస్ కుటుంబ సభ్యుడిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ, పులివెందుల్లో ఆ రకంగా తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించింది. ఎర్ర గంగిరెడ్డి బయట వుంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు వుందని సీబీఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ అధికారులనే గంగిరెడ్డి బెదిరిస్తున్నారని సీబీఐ వాదించింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఆశ్చర్యపోయినట్టు సమాచారం.
కేసు విచారణ సవ్యంగా సాగాలన్నా, దోషులెవరో తేల్చాలన్న సాక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని సీబీఐ వాదించింది. కావున ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలని ధర్మాసనానికి సీబీఐ విన్నవించింది. బెయిల్ రద్దుపై సమాధానం ఇవ్వాలని ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది.