జనసేనాని పవన్‌కల్యాణ్ అనుచరులపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని తోక లేని కోతులుగా ఆయన వెటకరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దుర్మార్గ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. రాజధాని విషయంలో అలాంటి రాజకీయాన్నే చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖలో జనసేన కార్యకర్తలే వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు. మంత్రి ఆర్కే రోజా బుర్ర పగిలేదని, తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. ఇలాంటివి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. వీటిని ఎక్కడైనా ప్రోత్సహించవచ్చా? అని నిలదీశారు. ఏ ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా ఇలాంటి చర్యలను ఎవరూ క్షమించరన్నారు. పవన్‌కల్యాణ్ వెంట వుండే పిల్లలకి తోక ఒక్కటే తక్కువని వ్యంగ్యంగా అన్నారు.
వాళ్లకే పాపం తెలియదన్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని చేస్తూ, మళ్లీ తనకేం సంబంధం లేదని ఆయన అంటా వుంటారని విమర్శించారు. ఇలాంటివి అవసరమా? అని పవన్‌ను మంత్రి నాగేశ్వరరావు ప్రశ్నించారు. పవన్ వెంట వుండే వారు అమాయకులని, బట్టలు చించుకుంటారన్నారు. పవన్‌ని చూస్తే రెచ్చిపోతారన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా వుండాలంటే, ఒకరోజు అటూఇటుగా కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవాలని పవన్‌కు హితవు చెప్పారు.
ఏదైనా జరగరానిది జరిగితే, రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మీరే మాట్లాడ్తారన్నారు. పవన్ కారుపైన అతన్నే తోసి కిందపడేశారు … ఈ తోకలేని కోతులు అని వెటకరించారు. ఒక ప్రాంతానికి చెందిన వారు ఉద్యమం చేసుకుంటున్నారన్నారు. అక్కడికి వెళ్లి రెచ్చగొట్టే పని చేయకూడదన్నారు. చంద్రబాబు ట్రాప్‌లో పవన్‌కల్యాణ్ పడుతున్నారని తాను అనుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. విశాఖ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలన్నారు.