కాబూల్ విమానాశ్రయంలో జరిగిన బాంబు పేలుళ్లలో పదుల సంఖ్యలో మనుషులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దేశవిదేశస్తులున్నారు. తమ పౌరుల ప్రాణాలు తీయడంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్రంగా స్పందించారు.
కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని జో బైడెన్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు.
ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ నాయకులను అంతమొందించాలని అమెరికన్ ఆర్మీని ఆయన ఆదేశించారు.
అలాగే ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా పౌరులను తరలిస్తామని, తమ మిషన్ కొనసాగుతుందని జోబైడెన్ ప్రకటించారు. కాబూల్ దాడి వెనక తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని జో బైడెన్ ప్రకటించారు.
ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా.. తన ప్రాణాలను ఫణంగా పెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. కాబుల్ పేలుళ్ల ఘటనలో కనీసం 72 మంది మృతి చెందారని, వారిలో 12 మంది అమెరికా సైనికులు ఉన్నారని ఆయన ప్రకటించారు.