రాష్ట్రం అప్పుల్లో ఉంటే సీఎం జగన్ విహార యాత్రలకు వెళ్తారా..? ఇదీ రెండు రోజులుగా పచ్చపాత మీడియాలో జరుగుతున్న ప్రచారం. దానికి వంతపాడే ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపుల్లో జరుగుతున్న చర్చ. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంటే, దాన్ని బయటపడేయడం మానేసి సీఎం జగన్ టూర్లకు వెళ్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసం అని, డిబేట్లు పెడుతున్నారు. జగన్ పర్సనల్ టూర్ ని కూడా నిస్సిగ్గుగా రాజకీయం చేస్తున్నారు.
అసలు రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి, సీఎం వ్యక్తిగత పర్యటనలకు ఏమైనా లింక్ ఉందా. ఆ మాటకొస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు మిగులు నిధులున్నాయి, ఏపీ అప్పుల్లో ఉంది. ఆ దిగులుతో చంద్రబాబు ఒంటి పూట భోజనం చేశారా, మిగులు నిధులున్నాయి కదా అని కేసీఆర్ ఆరు పూటలు భోజనం చేశారా? లేదు కదా.. మరి జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్తే టీడీపీ అనుకూల మీడియాకు ఎందుకంత కడుపుమంట..?
ఈనెల 28న తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా జగన్ కుటుంబ సమేతంగా సిమ్లా టూర్ కి వెళ్లారు. ఈనెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి వస్తారు. నాలుగు రోజుల టూర్ కి సంబంధించి అధికారులకు, నేతలకు మార్గనిర్దేశనం చేసిన తర్వాతే జగన్ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటిరెండుసార్లు విదేశీ పర్యటనలు మినహా జగన్ ఎక్కడికీ వెళ్లింది లేదు. పూర్తిగా రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు.
ఆమాటకొస్తే పాదయాత్రలో జగన్ కుటుంబాన్ని కలిసిన సందర్భాలు అతి తక్కువ. ఎక్కువగా జనంలోనే ఉండటానికి ఇష్టపడ్డారాయన. సీఎం కుర్చీలో కూర్చున్నాక నిరంతరం సమీక్షలు, సమావేశాలతోనే తీరిక లేకుండా గడిపారు. ఇప్పుడు కుటుంబంతో విహార యాత్ర ప్లాన్ చేసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం విడ్డూరం. దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పోల్చి చెప్పడం మరీ దారుణం.
చంద్రబాబు, చినబాబు గురించి రాయగలరా..?
అధికారాన్ని అడ్డం పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్.. ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారో లెక్కే లేదు. అంతర్జాతీయ సమ్మిట్ ల పేరుతో ప్రజా సొమ్ముని నీళ్లలా ఖర్చు చేశారు. పాలన పట్టించుకోకుండా, వ్యక్తిగత స్వార్థం చూసుకున్నారు కాబట్టే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులున్నాయి.
ఇప్పుడు రచ్చ చేస్తున్న వీరంతా.. అప్పట్లో బాబు, లోకేష్ ని పల్లెత్తు మాట అన్నారా..? అనరు కూడా. జగన్ ఏది చేసినా అది ప్రతిపక్షాలకు వింతగానే తోస్తుంది. ఇప్పుడు ఆయన వ్యక్తిగత పర్యటన కూడా వారికి రాష్ట్ర సమస్యగా తోస్తోంది.