ముఖ్యమంత్రి జగన్ సొంత పత్రిక సాక్షి మీడియా ఆలోచన ఏంటో ఎవరికీ అర్థం కాదు. ముఖ్యంగా సాక్షి పత్రిక ప్రాధాన్యతలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తుంటాయి. ఒక్కోసారి వైసీపీ శ్రేణుల మతి పోగొడుతోంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి, వైసీపీకి ప్రయోజనం కలిగించే వార్తాంశాల్ని కూడా… ఎక్కడో లోపల పేజీల్లో వేస్తూ తమ పాఠకులకి తెలియకుండా ఆ పత్రిక తగిన జాగ్రత్తలు తీసుకుంటోందనే సెటైర్స్ వినవస్తున్నాయి.
తాజాగా అలాంటి ఓ వార్త గురించి తెలుసుకుందాం. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల కమిషన్ (హెచ్చార్సీ) ప్రధాన కార్యాలయం ఏర్పాటుపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్చార్సీని కర్నూలుకు మారుస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అమరావతి కేంద్రంగా ఏపీ హెచ్చార్సీని ఏర్పాటు చేస్తూ 2017 అక్టోబర్ 24న చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు తాజా నోటిఫికేషన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు.
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే క్రమంలో ఇది కీలక అడుగుగా భావించొచ్చు. హెచ్ఆర్‌సీతో పాటు లోకాయుక్త ప్రధాన కార్యాలయాన్ని కూడా కర్నూలులోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కార్యాలయాల వెతుకులాటలో అధికారులు ఉన్నారు. ఇది జగన్ పాలనకు శుభ సూచికం. ప్రభుత్వ వ్యతిరేక పత్రికలు ఎటూ ఈ సంగతుల్ని దాచి పెడతాయి. కానీ ఈనాడులో హెచ్ఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులోనే అంటూ మొదటి పేజీలో వార్త ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ తాజా జీవోతో పాటు హైకోర్టు కీలక వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారాన్ని ఆ వార్తా కథనంలో ఈనాడు రాసుకొచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సాక్షి విషయానికి వస్తే…లోపలి పేజీలో ‘హెచ్ఆర్సీని ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు’ శీర్షికతో ఓ సాధారణ వార్తగా ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ శీర్షిక చదివితే… వెంటనే ‘ఏ వార్తనైనా ఎక్కడైనా ఇవ్వొచ్చు’ అనే భావన స్ఫురిస్తుంది. మూడు రాజధానుల అంశంపై తీవ్ర ప్రభావం చూపే ఈ హెచ్ఆర్‌సీ ఏర్పాటుపై హైకోర్టు వ్యాఖ్యలను, ప్రభుత్వ ఉత్తర్వుల సమాచార వార్తను సాదాసీదాగా ఇవ్వడంపై ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలుసొచ్చాయి.
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 90 శాతం, కేవలం 10 శాతం మాత్రమే అనుకూలంగా తీర్పులొస్తున్న నేపథ్యంలో సాక్షి యాజమాన్యం, ఎడిటోరియల్ పెద్దలు కలిసి ఓ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారట! అనుకూలంగా వచ్చే పది శాతం వార్తల్ని హైలెట్ చేయడం ద్వారా, మిగిలిన 90 శాతం వార్తల విషయమై ప్రశ్నిస్తారని, అందువల్ల అన్నిటికి ఒకే రకమైన స్పేస్ కేటాయిం చాలని నిర్ణయించారట!
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యాఖ్యలు, తీర్పులొచ్చినా సాక్షిలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని సాక్షి ఎడిటోరియల్ పెద్దలు చెబుతున్న మాట. అదేంటో ఇప్పుడు సాక్షిని ఎవరూ ప్రశ్నించనట్టు, అంతా మంచి పేరున్నట్టు భావించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి! సాక్షి పాఠకులెవరూ తెలిసి కూడా అర్థంపర్థం లేని పాలసీ తీసుకోవడం ఆ పత్రికకే చెల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీసం అప్పుడప్పుడు వచ్చే అనుకూల తీర్పులను కూడా తమ పాఠకులకు, ప్రజలకు చేరవేసే పరిస్థితి లేని, మంచీచెడుని ఒకే గాట కట్టేసే సాక్షి పాలసీ తగలెయ్యా అని ఎవరైనా అనకుండా ఉండగలరా?