జ‌గ‌న్‌లో జోష్ నింపిన జ‌డ్జిమెంట్‌

ఇది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌లో జోష్ నింపే జ‌డ్జిమెంటే. ఎందుకంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ (హెచ్చార్సీ) ప్ర‌ధాన కార్యాల‌యాన్ని క‌ర్నూలుకు మార్చాల‌ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై వ‌చ్చిన తీర్పుగా మాత్ర‌మే ఏపీ ప్ర‌జానీకం, ప్ర‌భుత్వం…

ఇది ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌లో జోష్ నింపే జ‌డ్జిమెంటే. ఎందుకంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ (హెచ్చార్సీ) ప్ర‌ధాన కార్యాల‌యాన్ని క‌ర్నూలుకు మార్చాల‌ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై వ‌చ్చిన తీర్పుగా మాత్ర‌మే ఏపీ ప్ర‌జానీకం, ప్ర‌భుత్వం భావించ‌డం లేదు. దీనికి, మూడు రాజ‌ధానుల అంశానికి ముడిప‌డి ఉన్న తీర్పుగా అర్థం చేసుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా హైకోర్టు ధ‌ర్మాస‌నం చేసిన కీల‌క వ్యాఖ్య‌ల‌ను ప్ర‌భుత్వానికి మోదం, టీడీపీకి, అలాగే అమ‌రావ‌తిలోనే ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని కొన‌సాగించాల‌ని కోరుకుంటున్న వారికి ఖేదం మిగిల్చాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీ హెచ్ఆర్‌సీ కార్యాల‌యం తెలంగాణ‌లో ఉండ‌టం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారంటూ ఏపీ పౌర‌హ‌క్కుల సంఘం సంయుక్త కార్య‌ద‌ర్శి మ‌ల్లేశ్వ‌ర‌రావు హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం (పిల్‌) దాఖ‌లు చేశారు. దీనిపై హైకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఏకే గోస్వామి, జ‌స్టిస్ ఎన్‌.జ‌య‌సూర్య‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా క‌ర్నూలులో హెచ్ఆర్‌సీ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతుంద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టు ధ‌ర్మాస‌నం ఏమ‌న్న‌దంటే…

“తెలంగాణ‌లో కాకుండా రాష్ట్ర ప‌రిధిలో హెచ్చార్సీని ఏర్పాటు చేయాల‌ని గ‌తంలో స్ప‌ష్టం చేశాం. ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌నేది రాష్ట్ర విశేషాధికారం. రాష్ట్రంలో ఫ‌లానా చోటే హెచ్ఆర్‌సీని ఏర్పాటు చేయాల‌ని చెప్ప‌లేం” అని తేల్చి చెప్పింది. ఇదే విష‌యాన్ని మూడు రాజ‌ధానుల‌పై కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం మొద‌టి నుంచి వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక రాజ‌ధానా? మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసుకోవాలా? ఎక్క‌డ ఏర్పాటు చేసుకోవాల‌నేది రాష్ట్ర ప్ర‌భుత్వ విచ‌క్ష‌ణాధికార‌మ‌ని, తమ జోక్యం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని అంశంపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌టం, తాజాగా హెచ్ఆర్‌సీ కార్యాల‌యం క‌ర్నూలులో ఏర్పాటుపై కీల‌క వ్యాఖ్య‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం, వైసీపీ నేత‌లు ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు, హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌ధానిపై ప్ర‌భుత్వ వాద‌న‌ల‌కు కూడా ఇదే ర‌క‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని ప్ర‌భుత్వం, వైసీపీ భావిస్తోంది.

ఏది ఏమైనా హెచ్ఆర్‌సీ కార్యాల‌యం ఏర్పాటు అనేది చిన్న విషయ‌మే అయినా, విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వ విశేషాధికార‌మ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేయ‌డం అనేక అంశాల‌కు ముడిప‌డి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే ఈ జ‌డ్జిమెంట్ జ‌గ‌న్‌కు గొప్ప ఊర‌ట‌నిచ్చేద‌ని వారు చెప్ప‌డం.