ఆయన్ను ప్రధాన మంత్రిని చేసింది నేనే, ఈయన్ను రాష్ట్రపతిని చేసింది నేనేనంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన మరో గొప్ప చెప్పుకోడానికి రెడీ అవుతున్నారు. సోనూ సూద్ కి సమాజ సేవ చేయాలన్న ఆలోచన కూడా తన వల్లే వచ్చిందని డప్పు కొట్టుకోబోతున్నారు బాబు.
చంద్రబాబు అనుకూల మీడియా దానికి తగినట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. వన్ ఫైన్ మార్నింగ్ సోనూతో అలా ప్రకటన ఇప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆ మధ్య చంద్రబాబు కరోనా జూమ్ కాన్ఫరెన్స్ లో సోనూ సూద్ ని కూడా కలుపుకొని హంగామా చేశారు. ఆయన మా పార్టీయే అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి సోనూతో కలసి బాబు ఓ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్ లో సోనూని కూడా కలిపేసుకున్నారు బాబు. “సమాజ శ్రేయస్సుని నిర్థారించే మార్గాలు” అనే పేరుతో ఈ వెబినార్ నిర్వహించారు.
పనిలో పనిగా ఆ వెబినార్ లో ఆత్మస్తుతి-పరనింద కూడా మొదలు పెట్టారు బాబు. తాను ప్రభుత్వాన్ని ముందుగానే అలర్ట్ చేసినా, తన మాటలు లక్ష్యపెట్టలేదని, ఫలితంగా కరోనా తొలి దశలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని మొసలి కన్నీరు కార్చారు.
హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ బాబుదేనా..?
ఈ వెబినార్ లో పాల్గొన్న సోనూ సూద్.. చంద్రబాబు విజన్ ని ఆకాశానికెత్తేసినట్టు పచ్చపాత మీడియా హైలెట్ చేసుకుని ప్రచురించుకుంది. హైదరాబాద్ అభివృద్ధి అంతా చంద్రబాబు దూరదృష్టితోనే సాధ్యమైందని, సంక్షోభ సమయంలో చంద్రబాబు అందరికీ ఆదర్శంగా నిలిచారని సోనూ అన్నారట. చంద్రబాబుతో మీటింగ్ పెడితే, జగన్ ని ఎవరూ పొగడలేరు కదా. సోనూ కూడా మొహమాటానికి బాబు చేసిన అభివృద్ధి అన్నట్టున్నారు.
నిజంగా పొగడాలి అనుకుంటే.. ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. అది ఎలాగు కనిపించదు కాబట్టి, మధ్యే మార్గంగా హైదరాబాద్ అభివృద్ధి అని అన్నట్టున్నారు. అంతమాత్రానికే సోనూ సూద్, చంద్రబాబుకి అభిమానిగా మారిపోయినట్టు బిల్డప్ ఇచ్చింది టీడీపీ అనుకూల మీడియా.
ఆ ఒక్కటే మిగిలుంది.
రాజకీయ పార్టీలతో అంటకాగితే ఏమవుతుందో సోనూ సూద్ కి బాగా తెలుసు, అందుకే ఆయన ఇన్నాళ్లూ అందరికీ దూరంగా ఉన్నారు. ఏ నాయకుడినీ పొగడలేదు, ఎవరికీ తనను పొగిడే అవకాశం ఇవ్వలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఏరికోరి ఇప్పుడాయన పసుపు రంగు పూసుకుంటానంటే ఎవరూ కాదనరు కానీ, చంద్రబాబు మాత్రం ఆయన్ని ఓ రేంజ్ లో వాడేస్తారనడంలో సందేహం లేదు.
అసలు సోనూ సూద్ కి సమాజ సేవ అనే ఆలోచన, తనను చూసిన తర్వాతే వచ్చిందని కూడా చెప్పుకుంటారు. ఆ మాటకొస్తే సోనూకి ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయమని చెప్పింది కూడా తానేనంటారు. అంతదూరం రాకముందే సోనూ సూద్ జాగ్రత్త పడితే మంచిదేమో. లేదంటే బాబు వాడకం ఎలా ఉంటుందో సోనూ రుచిచూడాల్సి ఉంటుంది.