ఉత్తరుడే సిగ్గుప‌డేలా…!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చూసి ఉత్త‌రుడే సిగ్గుప‌డతాడేమో! మ‌హాభారతంలో విరాట‌రారు, సుధేష్ణ కుమారుడు ఉత్త‌రుడు. ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప‌, ఆచ‌ర‌ణ‌లో అంతా ఉత్తుత్తిదే అనే సంగ‌తి తెలిసిందే. ఊరికే మాట‌లు చెబుతూ, ప‌బ్బం గ‌డుపుకునే వారిని ఉత్తరుడితో…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చూసి ఉత్త‌రుడే సిగ్గుప‌డతాడేమో! మ‌హాభారతంలో విరాట‌రారు, సుధేష్ణ కుమారుడు ఉత్త‌రుడు. ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప‌, ఆచ‌ర‌ణ‌లో అంతా ఉత్తుత్తిదే అనే సంగ‌తి తెలిసిందే. ఊరికే మాట‌లు చెబుతూ, ప‌బ్బం గ‌డుపుకునే వారిని ఉత్తరుడితో పోలుస్తుంటారు. తాజాగా విశాఖ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌వ‌హార‌శైలిని చూస్తే… ఎవ‌రికైనా ఉత్త‌రుడే గుర్తొస్తాడు. విశాఖ ఏసీపీకి ఆయ‌న ఇచ్చిన స‌మాధానం జ‌న‌సేన సైనికుల్ని షాక్ గురి చేసేలా వుంది.

విశాఖ ఎయిర్‌పోర్టు వ‌ద్ద గుమికూడిన వారితో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఏసీపీకి ఇచ్చిన వివ‌ర‌ణ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేర్కొన్నారు. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన తాను సాయంత్రం 4.40 గంట‌ల‌కు విశాఖ‌లో ల్యాండ్ అయిన‌ట్టు పేర్కొన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం ఎయిర్‌పోర్ట్‌కు వ‌చ్చి, అల్ల‌రి చేసిన వాళ్ల‌కు త‌మ నాయ‌కుడి నిజ స్వ‌రూపం తెలిసొచ్చింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు భ‌య‌మా? లేక రాజ‌కీయ అనుభ‌వ లేమా? కార‌ణాలు తెలియ‌దు కానీ, సంబంధం లేదని పోలీస్ అధికారుల‌కు రాసి ఇవ్వ‌డం సొంత పార్టీ వాళ్ల‌కు కూడా న‌చ్చ‌లేదు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్లేస్‌లో మ‌రే నాయ‌కుడు ఉన్నా ఇలా వ్య‌వ‌హ‌రించర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద త‌మ శ్రేణుల తీరు త‌ప్పని ప‌వ‌న్‌క‌ల్యాణే అధికారికంగా చెప్పిన‌ట్టైంది. అందుకే ఆ ఘ‌ట‌న‌తో సంబంధం లేద‌ని ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు. నిజానికి ఈ అవ‌కాశాన్ని ప‌వ‌న్ రాజ‌కీయంగా వాడుకోవాల్సింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ప‌వ‌న్ ఆ ప‌ని చేయ‌లేదు. హోట‌ల్‌కే ప‌రిమిత‌మై, ఏం చేయాలో దిక్కుతోచ‌క మేథోమ‌ధ‌నం పేరుతో పొద్దు గ‌డిపేందుకు య‌త్నిస్తున్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు.

త‌న కోసం వ‌చ్చిన వారిని అరెస్ట్ చేసినా, న‌గ‌రంలో ఉండి కూడా ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌డం ఏంట‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల నుంచి ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అంతా సినిమాను త‌ల‌పించేలా ప‌వ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న సాగుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రోడ్డుపైకి వ‌చ్చి ధ‌ర్నాకు దిగి వుంటే… క‌థ వేరేలా ఉండేద‌ని చెబుతున్నారు. 

ప‌వ‌న్ ఇమేజ్ పెరిగేదంటున్నారు. కానీ స‌మ‌స్య వ‌చ్చిన‌పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క ప‌వ‌న్ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డార‌ని గుర్తు చేస్తున్నారు. కేసుల‌కు, అరెస్ట్‌ల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే చెబుతుంటార‌ని, మ‌రి ఆ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనే స‌మ‌యం వ‌చ్చిన‌పుడు ఎందుకు నిరూపించుకోలేక పోయార‌నే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చాయి.