కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నిక 22 సంవత్సరాల తర్వాత పోలింగ్ వరకూ వచ్చింది. గత రెండు దశాబ్దాల పై నుంచినే ఏకగ్రీవంగా అధ్యక్ష స్థానాన్ని ఆక్రమిస్తూ వచ్చారు నెహ్రూ-గాంధీ కుటుంబీకులు. సీతారాం కేసరి తర్వాత సోనియాగాంధీ అధ్యక్ష స్థానాన్ని పొందారు. కాంగ్రెస్ సభ్యుల మద్దతు పొంది గెలవడం కన్నా.. ఆమె ఏకగ్రీవంగా నెగ్గడానికే ప్రాధాన్యతను ఇచ్చారు. ఇన్నాళ్లూ సోనియాకు పోటీగా నామినేషన్ వేసే సాహసం కూడా ఎవ్వరూ చేయలేదు!
ఇక రాహుల్ గాంధీ కూడా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయనే పదవిని వదులుకున్నారు. ఆ తర్వాత సోనియాగాంధీ ఆపద్ధర్మంగా అంటూ ఏకపక్షంగా తనే అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నారు. ఇలా జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఎట్టకేలకూ పోలింగ్ వరకూ వచ్చింది.
మరి ఈ సారి పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిదాయకమైన అంశమే. పార్టీలో సీనియర్ నేత అయిన మల్లిఖార్జున ఖర్గే, మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ లు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. మరి వీరిలో ఎవరు గెలిచినా అదో విడ్డూరమైన, విశేషమైన అంశం అవుతుంది.
ఖర్గే గెలిస్తే చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. పార్టీపై సోనియాగాంధీ, రాహుల్ ల గ్రిప్ ఏ మాత్రం తగ్గలేదనేందుకు అది నిదర్శనం అవుతుంది. వారి కనుసన్నల్లోనే ఖర్గే ఎన్నికయ్యారనే అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తం అవుతాయి. ఖర్గే గెలిస్తే.. ప్రత్యర్థులకు కూడా ఈ విషయాలపై క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ గాంధీల కనుసన్నల్లోనే ఉందని స్పష్టం అవుతుంది.
అదే థరూర్ గెలిస్తే.. ఇదే అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. ఖర్గే గెలిస్తే అదో విడ్డూరం అవుతుంది. థరూర్ గెలిస్తే అదో విశేషం అవుతుంది. థరూర్ కు సోనియా, రాహుల ల మద్దతు లేదు. థరూర్ పోటీ చేయాలనుకుని సోనియాను కలిస్తే… ఎవరైనా పోటీ చేసుకోవచ్చంటూ నిష్టూరమాడారట ఆమె. ఖర్గే వంటి బంటుకే సోనియా, రాహుల్ ల మద్దతు ఉంటుంది. అడ్డం తిరుగుతాడేమో అనుకునే థరూర్ కు వారి మద్దతు ఎప్పటికీ ఉండదు.
స్వతంత్రభావాలున్న నేతకు అలాంటి అవకాశం ఇవ్వడం వారికి ఇష్టం ఉండదు. అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ కబంధ హస్తాల నుంచి బయటపడటం మొదలైనట్టే. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోటీ ఖర్గేకూ థరూర్ కు కాదు. గాంధీలకూ థరూర్ కు అనుకోవాలి. థరూర్ గెలిస్తే.. కాంగ్రెస్ లో అద్భుతాలు జరగడం మాట ఎలా ఉన్నా.. గాంధీల పట్ల సొంత పార్టీలోనే విముఖత ఉందనే విషయం మాత్రం తేటతెల్లం అయినట్టే! మరి కాంగ్రెస్ సభ్యులు ఏ అభిప్రాయంతో ఉన్నారో!