‘దేశం’ ఐడియా బూమరాంగ్

ఏదో వైకాపా ఎత్తును చిత్తు చేద్దాం అనుకున్నారు తప్ప‌ ఇలా అవుతుంది అనుకోలేదు. పగవున్నవాడిని కొట్టబోతే భక్తి వున్నవాడికి తగిలిందన్న సామెతగా మారింది వ్యవహారం. మూడు రాజ‌ధానుల వ్యవహారాన్ని ఉత్తరాంధ్ర జ‌నంలోకి బలంగా తీసుకెళ్లాలని…

ఏదో వైకాపా ఎత్తును చిత్తు చేద్దాం అనుకున్నారు తప్ప‌ ఇలా అవుతుంది అనుకోలేదు. పగవున్నవాడిని కొట్టబోతే భక్తి వున్నవాడికి తగిలిందన్న సామెతగా మారింది వ్యవహారం. మూడు రాజ‌ధానుల వ్యవహారాన్ని ఉత్తరాంధ్ర జ‌నంలోకి బలంగా తీసుకెళ్లాలని అనుకుంది వైకాపా. కనీసం దాన్ని కింది స్థాయి వరకు ఓ డిస్కషన్ పాయింట్ గా మార్చాలని అనుకుంది. అందుకోసం విశాఖ గర్జ‌న అనే కార్యక్రమం తలపెట్టింది.

దీంతో అస్సలు ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిపోయారు. మరి నిజంగా వెనుక నుంచి ఏ డైరక్షన్ వచ్చిందో, లేదా తానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో మొత్తానికి చటుక్కున రంగంలోకి దిగిపోయారు. దీని వల్ల జ‌రిగిన పరిణామాల కారణంగా పవన్ కు మైలేజీ వచ్చిన మాట వాస్తవమే కానీ అతగాడు తెలుగుదేశం మనిషి అనే అపవాదు మరింత బలపడింది. మరింత బలంగా జ‌నంలోకి వెళ్లింది. ఆ సంగతి నమ్మేవాళ్లు నమ్ముతారు. లేని వాళ్లు లేదు.మొత్తానికి అది వేరే సంగతి.

విశాఖ అన్నది తెలుగుదేశం పార్టీకి కీలకం. కృష్ణా..గుంటూరు జిల్లాల కన్నా విశాఖ మీద ఎక్కువ ఆధారపడి వుంది తెలుగుదేశం అభిమాన సామాజిక వర్గం. ఉత్తరాంధ్ర జిల్లాల వెనకబాటు తనం, మెతకతనం ఆధారం చేసుకుని మూడు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ రాజ‌కీయ, వ్యాపార రంగాల్లో పాతకుపోయిన ఆ వర్గానికి వైకాపా ప్రభుత్వం నుంచి గట్టి దెబ్బే తగిలింది. వ్యాపారాలు సాగడం మాట అలా వుంచి చాలా రకాలుగా దెబ్బలు తిన్నారు. తిరిగి పుంజుకోవాలంటే విశాఖ తమ చేతిలోకి తెచ్చుకోవాల్సి వుంది. వుంచుకోవాల్సి వుంది.

ఉత్తరాంధ్ర రాజ‌ధాని అయితే రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని వర్గాలు ఇక్కడకు వస్తాయి. తమ ఆధిపత్యం ఎక్కడ తగ్గిపోతుందనే భయం వుండనే వుంది. ఇలాంటి నేపథ్యంలో విశాఖ గర్జ‌న ను నిలవరించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ ను రంగంలోకి దింపారో, పవన్ నే దిగారో, మొత్తానికి ఏదో జ‌రిగింది.

విశాఖ గర్జ‌నను తాము అడ్డుకుంటే తమ పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని తెలుగుదేశానికి తెలియంది కాదు. అందుకే ఈ విషయంలో తెరచాటునే వుండిపోయింది. దాని సామాజిక అను’కుల’ డిజిటల్ మీడియా మాత్రం ఏదో కొంత కిందా మీదా పడింది. ఇంతలో విమానాశ్రయంలో మంత్రులపై ఔత్సాహిక జ‌నసైనికుల దాడి వల్ల పరిస్థితి దారి తప్పింది. అక్కడ అసలు కథ స్టార్ట్ అయింది.

వైకాపా పంతానికి పోయింది. పవన్ కళ్యాణ్ ‘మి టూ’అన్నారు. సహజంగా పవన్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అది వైరల్ ఇస్యూ అయింది. ఈ ఇస్యూనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారబోతోంది. అలా మారకుంటే జ‌నసేనకు ఇబ్బంది అవుతుంది. అదెలా అన్నది చూద్దాం.

పవన్ కళ్యాణ్ తన కళ్లతో విశాఖలో తనకు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసారు. గతంలో జెడి లక్ష్మీనారాయణ ను ఇక్కడ నిలిపారు. ఇప్పుడు మరోసారి విశాఖ ఎంపీ సీట్ ను అడగడం లేదా టౌన్ లో మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను అడగడం తప్పకుండా చేస్తారు. అంతే కాదు, తెలుగుదేశంతో పొత్తు అనేది వుంటే ఇరవై, పాతక స్థానాలతో సరిపెట్టుకోరు. కనీసం యాభై స్థానాలకు పైగా డిమాండ్ చేసే అవకాశం వుంది.

ఇదే సమయంలో జ‌నసేనతో పొత్తు వున్న భాజ‌పా కూడా ఇదే సమయం అని ఆలోచిస్తుంది. అందుకే నిన్నటికి నిన్న జ‌నసేన కు మద్దతుగా భాజ‌పా గళం కలిపింది. కానీ తెలుగుదేశం అలా చేయలేకపోయింది. కేవలం చంద్రబాబు నేరుగా పవన్ తో ఫోన్ లో మాట్లాడారు అన్న వార్త తప్ప మరొకటి కనిపించలేదు. అందువల్ల భాజ‌పా ఇప్పట్లో పవన్ తో పొత్తును వదలుకోదు. జ‌నసేన తెగతెంపులు చేసుకుని తెలుగుదేశం వరకు వెళ్లలేదు. ఏదో విధంగా భాజ‌పాను ఒప్పించి తీసుకెళ్లాలి. ఇది కాస్త టఫ్ టాస్క్ అవుతుంది ఇప్పుడు. మన బలం మనకు వుండగా తెలుగుదేశం ఎందుకు అన్న ప్రశ్న భాజ‌పా నుంచి జ‌నసైనికుల నుంచి ఎదురవుతుంది.

ఈ పరిస్థితి ఊహించిన తెలుగుదేశం అనుకుల సామాజిక మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియా స్తబ్దుగా వుండిపోయింది. మొక్కుబడి కవరేజ్ తప్ప పవన్ హఢావుడిని గట్టిగా ప్రెజెంట్ చేయడానికి మనసు రాలేదు. జ‌నసేన హీరోయిజం, ప్రభుత్వ భంగపాటు కలిసి పత్రికల్లో తాటికాయంత అక్షరాల్లో పతాక శీర్షికల్లో వార్తలు కనిపిస్తాయనుకుంటే ఆ సీన్ నే కనిపించలేదు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైలంట్ గా వుంది. జ‌నసేన బలమో, ఫ్యాన్స్ వాపో అన్నది తరువాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం బలమే అనుకోవాల్సిందే. అది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది క‌ర‌మే తప్ప వేరు కాదు. తెలుగుదేశం సంగతి సరే, వైకాపా మాటేమిటి అని అడగొచ్చు. ఉత్తరాంధ్ర జ‌నంలోకి మూడు రాజ‌ధానులు, విశాఖ రాజ‌ధాని అనే అంశాన్ని ఎంత లోతుగా తీసుకెళ్లాలని అనుకున్నారో అంత లోతుగానూ వెళ్లిపోయింది. వైకాపా గర్జ‌న‌ పుణ్యమే కాదు జ‌నసేన హడావుడి వల్ల కూడా.

అందువల్ల వచ్చే ఓట్లు ఎలాగూ వస్తాయి. రాని ఓట్లు ఎలాగూ రావు. మహా అయితే ఈ ఉదంతం వైకాపాను విశాఖ అర్బన్ ఏరియాలో కొంచెం బ్యాడ్ చేస్తుంది. గతంలో కూడా అర్బన్ లో వైకాపా పెద్దగా ఊడబొడిచింది లేదు. రాజ‌కీయం మూడు పార్టీల మధ్య మూడు ముక్కలాటగా రంజుగా మారడం మాత్రం సాధ్యపడింది.