రిటైర్డు ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ ఎంపీ పదవి మీద మళ్లీ మనసు పడుతున్నారు. ఎలాగైనా సరే.. లోక్ సభలో ఎంపీగా అడుగుపెట్టాలనే కోరికతో గతంలో ఒక దఫా ప్రయత్నం చేసి దారుణంగా పరాభవం మూటగట్టుకున్న జేపీ.. ఇన్నేళ్లుగా పార్టీని గాలికొదిలేసి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నప్పటికీ.. తాజాగా తనలో ఎంపీ కావాలనే ఆశ రూపుమాసిపోలేదని చాటుకుంటున్నారు.
ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని తమ పార్టీ సమావేశంలో డిసైడ్ అయ్యారు. తమతో కలిసి వచ్చే పార్టీ ఉంటే గనుక.. వారి పొత్తులతో ఆయన ఎంపీగా పోటీచేస్తారట. చాలా క్లియర్ గా తెలుగుదేశానికి ఒక సంకేతం పంపారు.
లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ చిత్తశుద్ధిగల మేధావి. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణల్ని కోరుకునే మంచి మనిషి. ప్రజాస్వామ్యం సంస్కరణల ద్వారా మాత్రమే.. అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మే వ్యక్తి. అయితే ఆయన కూడా రాజకీయ రాగద్వేషాలకు లోనవుతుండడం గమనార్హం. అదే సమయంలో.. అధికార లాలసతను కూడా చంపుకోలేకపోతుండడం మరో విషయం.
జేపీ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానిక ప్రజలకు ఎమ్మెల్యేగా ఉపయోగపడింది తక్కువే అయినా.. శాసనసభలో మాత్రం ఒక మేధావికి తగిన మంచి గొప్ప ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. కానీ.. రాష్ట్రమంతా ఆయన పార్టీ పోటీచేసినా.. ఆయనొక్కడే గెలవడం జరిగింది. ఇన్ని సుద్దులు చెప్పే జేపీ కుల సమీకరణలు చూసుకుని కమ్మఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో పోటీచేసి గెలిచారనే అపకీర్తి కూడా వచ్చింది.
ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఎంపీగా మల్కాజ్ గిరి నుంచి పోటీచేశారు. తన పార్టీ కాకపోయినప్పటికీ.. మోడీ బొమ్మను కూడా పెట్టుకుని.. చిత్రంగా ప్రచారం చేశారు. ప్రధానిగా మోడీ రావాలి.. ఇక్కడ మాత్రం నన్ను ఎంపీని చేయండి అనేది ఆయన అప్పటి ప్రచారబాట. ప్రజలు తిప్పికొట్టారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎలాగైనా లోక్ సభ ఎంపీ కావాలనే కోరిక మళ్లీ రాజుకున్నట్టుగా ఉంది. వెళ్లి అమరావతిలో మీటింగులు పెట్టి.. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని, మూడు రాజధానులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనే లేదని ఈ మేధావి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ఇలా మాట్లాడితే.. తెలుగుదేశం పార్టీ పిలిచి ఒక సీటు ఇస్తుందనే ఆశ ఉన్నట్టుంది. ఆయనకు ఎంపీ కావాలని ఆశ.. మళ్లీ ఆ పార్టీ ముద్ర ఉండకూడదు. తన పార్టీ తరఫునే గెలిచినట్టు ఉండాలి. కానీ వారి దయ కావాలి. ఇలా రకరకాల ద్వైధీ భావనల మధ్య ఆయన మళ్లీ రాజకీయ అదృష్టం పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటినుంచి రాబోయే ఏడాదిన్నర పాటూ.. ఇంకెన్ని తెలుగుదేశం అనుకూల వాదనలను ఆయన నోటినుంచి వినాల్సి వస్తుందోమరి.