రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్, విడుదల నేపథ్యంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఎమ్మెల్యేను ఏ అధికారంతో స్థానిక పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ రాగాలు తీశారు. కిడ్నీ బాధితుడికి మద్దతుగా మాట్లాడటం తప్పా అని అన్నారు. అయితే మూడు గొంతులు మాత్రం కూడబలుక్కుని అచ్చం ఒకేలా మాట్లాడాయి. పవన్ కల్యాణ్ తన ఎమ్మెల్యేకి మద్దతుగా మాట్లాడాడంటే సరే.. చంద్రబాబు, లోకేష్ కూడా ట్విట్టర్ లో అవే డైలాగులు పేల్చడం మాత్రం ఆశ్చర్యం.
అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ స్పందించిన తర్వాతే చంద్రబాబు, లోకేష్ ఆ ఘటనను పెద్దది చేయాలని చూడటం గమనార్హం. తమ తప్పుని కప్పిపుచ్చుకోడానికి వీరు ఎంచుకున్న మార్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విమర్శించడం. వైసీపీ ఎమ్మెల్యే పత్రికా ఎడిటర్ పై దాడి చేశారని, వారికో న్యాయం, జనసేన ఎమ్మెల్యేకి మరో న్యాయమా అంటూ విమర్శించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే విషయంలో ప్రత్యక్ష సాక్షులెవరూ లేరు, తనపై దాడి జరిగింది అని చెబుతున్న సదరు ఎడిటర్ కి స్థానికంగా బ్లాక్ మెయిలర్ అనే పేరుంది.
జనసేన ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఆయన డైలాగులు, బెదిరింపులు, స్టేషన్ ముట్టడించడం వంటి వ్యవహారాలన్నీ పక్కాగా రికార్డ్ అయి ఉన్నాయి. అధికారులకు సూచనలు చేయండి కానీ, వారిపై ఒత్తిడి తెస్తే ఎవరైనా సహించబోనంటూ ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూసిన జనసేన ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ తన ఎమ్మెల్యేకి మద్దతుగా మాట్లాడటమే తప్పు అయితే, ఆ తప్పుని సమర్థించాలని చూడటం టీడీపీ చేసిన మరో తప్పు.
అయితే టీడీపీ మాత్రం ఈ అరెస్ట్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడుల్లో దీన్ని కూడా కలిపేసుకుంది. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలను రాచి రంపాన పెడుతున్నారని, టీడీపీ సహా జనసేన ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారు. టైమ్ దొరికింది కదా అని పవన్ ని దువ్వడం స్టార్ట్ చేశారు.
మొదట చినబాబు, తర్వాత పెదబాబు.. ఇద్దరూ జనసేనపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. పాత స్నేహ బంధాన్ని గుర్తుచేస్తూ అధికారపక్షంపై చేసే ఎదురుదాడిలో తమతో కలసి రావాలని కోరుతున్నారు. ఆశించకుండా వస్తున్న ఇలాంటి మద్దతుపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు కానీ, ఆయన ఈజీగానే పచ్చ బుట్టలో మరోసారి పడిపోతారనే విషయం మాత్రం తెలుస్తూనే ఉంది.