రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. వ్యాపారం పూర్తిస్థాయిలో మందగించింది. దీనంతటికీ కారణం జగన్ తొందరపాటులో తీసుకున్న నూతన ఇసుక విధానం. ఇదీ క్లుప్తంగా రాష్ట్రంలో జరుగుతున్న దుష్ప్రచారం. నూతన ఇసుక విధానం సెప్టెంబర్ 5న అమలు అవుతుందని చెప్పిన సర్కారు, ఈలోగా రెవెన్యూ అధికారుల అనుమతితో ఇసుక రవాణా చేసుకోవచ్చని వెసులుబాటునిచ్చింది. ఆ రోజు నుంచి ఇసుక రవాణా తగ్గిన మాట వాస్తవమే.
అయితే రోజులు గడిచేకొద్దీ.. రెవెన్యూ అధికారులు ఉదారంగానే ఇసుక రవాణాకు అనుమతులిచ్చేశారు. ప్రస్తుతం ఏ జిల్లాలోనూ కఠిన నిబంధనలు లేవు. కానీ అంతలోనే ప్రతిపక్షాలు రాద్ధాంతం మొదలు పెట్టాయి. ఇసుక రవాణా తగ్గిపోవడంతో నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని తప్పుడు ప్రచారం మొదలు పెట్టాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోలేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సిగ్నల్స్ మొదలయ్యాయి.
ఒక్క నిర్మాణ రంగమే కాదు.. చాలా విభాగాల్లో కొనుగోళ్లు అమ్మకాలు మందగించాయి. కార్ల బిజినెస్ పడిపోయింది, రిటైల్ బిజినెస్ మందగించింది.. ఈ లెక్కన చూసుకుంటే.. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం స్తబ్దుగా ఉందని తేలుతోంది. మరి ఈ ఒక్క రాష్ట్రానికే దీన్ని ముడిపెట్టి ఎలా చూస్తారు. పచ్చ పత్రికలు కూడా ఇప్పుడీ విషయాలను హైలెట్ చేస్తూ.. ఇసుకతో రాష్ట్రానికి తిప్పలొచ్చాయని కథనాలను వండి వారుస్తోంది. ఇసుక లేకపోవడంతో స్టీల్, సిమెంట్ విక్రయాలు కూడా తగ్గిపోయాయని, వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని ఈ కథనాల సారాంశం.
ఈ కష్టాలన్నిటికీ కారణం కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనంటూ ముక్తాయిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా నిర్మాణ రంగంలోని పనులు మందగించాయి. కొన్నిచోట్ల ఇసుక రవాణాకు అస్సలు ఏమాత్రం అవకాశం ఉండట్లేదు. ఇసుకే కాదు, కంకర, స్టీల్, సిమెంట్ సరఫరా కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నిదానించింది. ఇలా అన్ని విషయాలను గమనిస్తే.. ఇసుక విధానానికి, నిర్మాణ రంగంలో పనులు తగ్గడానికి సంబంధం లేదని తేలుతుంది.
దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం ఇదే స్థితిలో ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పరిస్థితి దారుణంగా ఉందని ప్రచారం చేయడం ఎంతవరకు సబబు. మొత్తమ్మీద ఓ పద్ధతి ప్రకారం జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టేందుకు ప్రతిపక్షం, తమ అనుకూల మీడియాతో కలసి తీవ్రంగా కృషిచేస్తుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.