మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ప్రభుత్వం చేపడుతున్న ఏ ఒక్క పనిని కూడా సహించలేకపోతున్నట్లుగా ఉంది. చివరికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాలకు లైటింగ్ ఏర్పాటు చేస్తే.. దానిని కూడా తన రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడడం నవ్వు తెప్పిస్తోంది. సచివాలయ భవనాలకు లైటింగ్ పెడితే.. దానిని కూడా జగన్మోహన రెడ్డిని విమర్శించడానికి వాడుకోవడం అనేది చంద్రబాబుకు మాత్రమే చెల్లిన విద్యలా ఉంది.
కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు ఈ విడతలో ట్వీట్లలో పలువిధాలుగా రెచ్చిపోతున్నారు. రోజూ ఏదో ఒక విధంగా పేపర్లలో కనిపిస్తే తప్ప.. ప్రజలు తనను మరచిపోతారేమోనని నిత్యం చింతిస్తూ ఉండే చంద్రబాబుకు ట్వీట్లు చేయడం అనేది ఇప్పుడు చాలా గొప్ప మార్గంగా కనిపిస్తున్నట్లుంది. ప్రతిసారీ మీడియా ముందుకు రాలేకపోయినా.. తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వెల్లడించడానికి … ట్వీట్లు రాజకీయ నాయకులకు గొప్ప అవకాశమే. అయితే చంద్రబాబు ట్వీట్లు మాత్రం తరచూ నవ్వులపాలవుతున్నాయి. తాజాగా ఆయన అలాంటిదే మరో ప్రయత్నం చేశారు.
‘‘దేవుడు స్ర్కిప్ట్ భలే రాశాడు… ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అంటూ అబద్ధాలు చెప్పారో వాళ్ల చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు’’ అని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఒకవేళ సచివాలయ భవనాలకు ఎలాంటి లైటింగ్ లేకుండా… చీకట్లో ఉంచేసి ఉంటే.. ఆ ట్వీటు ఎలా ఉండేదో తెలుసా? ‘‘స్వాతంత్ర్య దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం కూడా ఈ ప్రభుత్వానికి తెలియదు. మేమైతే ఘనంగా లైటింగ్ ఏర్పాటు చేసి గొప్పగా చేశాం’’ అని చెప్పుకుని ఉండేవాళ్లు అనుకుంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు.
అయినా.. ఒక భవనానికి లైటింగ్ పెట్టినందుకే చంద్రబాబు ఇలా మురిసిపోయి కౌంటర్లు ఇచ్చేస్తే ఎలా? నిజానికి ఆయన గత అయిదేళ్ల పాటూ ప్రజలకు కంప్యూటర్ తెరలమీద చూపించిన గ్రాఫిక్స్ అమరావతి నగరానికి లైటింగ్ పెట్టేంత అవకాశం వైకాపా ప్రభుత్వానికి లేదు కదా!