ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. పాకిస్తాన్ తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీని గురించి ఎవ్వరికీ పెద్ద చింత ఉండకపోవచ్చు. కానీ.. స్వాతంత్ర్య దినోత్సవం నాటి పరిణామాలు.. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అనే అనుమానాలను కూడా కలిగిస్తున్నాయి. సరిహద్దు వెంబడి ఇరుదేశాల సేనల మధ్య కాల్పులు జరిగాయి. పాక్ సైనికులు ముగ్గురు చనిపోయారని భారత్ అంటుండగా… వారితో పాటు అయిదుగురు భారత సైనికులు కూడా మరణించారని పాక్ పేర్కొంటోంది. ఏది ఏమైనప్పటికీ యుద్ధ సంకేతాలు అలముకుంటున్నది నిజం.
370 రద్దు జరిగిన నాటినుంచి పాకిస్తాన్ కవ్వింపు ధోరణితోనే వ్యవహరిస్తోంది. పాక్ లోని భారత రాయబారికి తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ నోటీసులు ఇవ్వడం, భారత్ కు పంపవలసిన పాక్ హైకమిషనర్ ను పంపకుండా అక్కడే ఆపేయడం, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకోవడం ఇవన్నీ కూడా అలాంటి కవ్వింపు చర్యల్లో భాగాలే.
తమ దేశపు అంతర్గత వ్యవహారంలో భారత్ ఓ నిర్ణయం తీసుకోగా.. భారత్ చర్యలకు తాము దీటుగా జవాబిస్తామని.. పాక్ కవ్వింపు ధోరణిలో వ్యవహరించింది. ఆ మాటల తాలూకు ఫలితం స్వాతంత్ర్య దినోత్సవం నాడే కనిపించినట్లుగా ఉంది. నియంత్రణ రేఖ వెంబడి ఉరి, రాజౌరీ సెక్టార్ లలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అనివార్యంగా ఎదురు కాల్పులు చేయడంతో ముగ్గురు పాక్ సైనికులు మరణించారని ఒక ప్రకటన వచ్చింది.
అదే సమయంలో, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూనే భారత సైనికులు కూడా అయిదుగురు మరణించినట్లు పాక్ సైనికాధికారి ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ లోని అల్ జజీరా టీవీ ఛానెల్ కూడా పేర్కొన్నది. ఒక పాకిస్తాన్ పత్రిక అయితే.. ఏకంగా అయిదుగురు భారత సైనికులతో పాటూ, పీఓకేలోని ఇద్దరు పౌరులు కూడా మరణించినట్లు కథనం అందించింది.
సాధారణంగా ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు.. వాస్తవంగా మరణించిన సైనికుల సంఖ్యను ఎవ్వరూ బయటపెట్టరు. అందుకే పాక్- భారత్ అధికారులు చెరోరకంగా మాట్లాడుతున్నప్పటికీ.. యుద్ధమేఘాలు కమ్ముకున్నది మాత్రం నిజమే అనిపిస్తోంది.