ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర పార్టీలనుంచి రాదలచుకున్న వారు, తమ పదవులకు రాజీనామా చేస్తే తప్ప చేర్చుకునేది లేదని సీఎం జగన్ ఖండితంగా చెబుతున్నారు. శాసనసభ స్పీకరు ఫిరాయింపుల విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. ఎలాంటి ఫిరాయింపులను గానీ, ఏ పార్టీలోకి చేరడాన్ని గానీ ఒప్పుకునేది లేదని.. తెగేసి చెప్స్తున్నారు. ఆ రకంగా ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపులు అంత ఈజీగా సాధ్యం కాకపోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం.. ‘ఆపరేషన్ సిక్కిం’ను ఆంధ్రప్రదేశ్ లో కూడా అమల్లో పెట్టి లబ్ధి పొందాలని చూస్తోంది.
ఇంతకూ సిక్కింలో ఏం జరిగిందంటే… ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేకపోయింది. కానీ ప్రస్తుతం, అంటే కేవలం మూడు నెలలు కూడా గడవకుండానే.. ఆ పార్టీకి ఇప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించింది. అదే తమాషా. అందుకే అదే సూత్రాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వచ్చింది. అక్కడ గతంలో 25 ఏళ్లపాటూ ముఖ్యమంత్రిగా ఉన్న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 13 మంది మాత్రమే గెలుపొందారు. దాంతో వారు ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మొత్తం అక్కడ ఉన్నది 32 సీట్లే. కాగా భాజపా ఒక్క సీటులో కూడా గెలవలేదు.
తాజాగా మారిన రాజకీయ పరిణామాల్లో ఎస్డీఎఫ్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఇద్దరేమో అధికార క్రాంతికారీ మోర్చాలో చేరారు. మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు భాజపా తీర్థంపుచ్చుకున్నారు. ఎస్డీఎఫ్ లో వ్యవస్థాపకుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ ఒక్కరే మిగిలారు. పరిణామాలు చాలా చిత్రంగా మారిపోయాయి. అసెంబ్లీలో ఒక్కస్థానం గెలవకపోయినా.. భాజపా ప్రధాన ప్రతిపక్షం అయింది.
సేమ్ టూ సేమ్ సిచుయేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలోం 23 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు. భాజపా ఒక్క సీటు కూడా గెలవలేదు. తెదేపా నుంచి కనీసం 15 మంది ఎమ్మెల్యేలు భాజపాలోకి ఫిరాయిస్తారనే పుకారు చాలా కాలంగా ఉంది.
ఇప్పుడు సిక్కిం పరిణామాలను చూపించి… భాజపాకు ఆదరణ పెరుగుతున్నదని చాటుకుని, ఆ ఫిరాయింపులను తొందరగా పూర్తి చేయాలని భాజపా యోచిస్తోంది. అయితే నిజానికి అలా జరగడానికి వైకాపానే అడ్డు నిలుస్తున్నట్లు లెక్క. ఫిరాయింపులను చూసీ చూడనట్లుగా స్పీకరు వదిలేసే అవకాశం ఉంటే గనుక.. తెదేపాలోంచి మెజారిటీ సభ్యులు కమలతీర్థం పుచ్చుకోవడం సిక్కిం తరహాలో చాలా సునాయసంగా సాధ్యమవుతుంది. కమలం ఆ ప్లాన్ తోనే ఉంది. మరి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.