సినిమాలే ప్రపంచం అన్నట్టు ….నటీనటులు ఉంటుంటారు. లోకంతో తమకెలాంటి సంబంధం లేదనే భావనలో మరీ ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉండడం తెలిసిందే. అయితే యంగ్ హీరో నిఖిల్ మాత్రం దీనికి కొంచెం భిన్నంగా ఉంటారు.
సామాజిక సమస్యలపై తనదైన స్టైల్‌లో స్పందిస్తూ… ఒక్కోసారి తన ఆగ్రహాన్ని ఏ మాత్రం దాచుకోరు. అసలే అబ్బాయి గారు హీరో కావడంతో నిఖిల్ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారి తీస్తుంటాయి.
తాజాగా నిఖిల్ ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఆయన అఫ్ఘనిస్థాన్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ టార్గెట్‌గా తీవ్ర అభ్యంతరకర ట్వీట్ చేయడం గమనార్హం.
‘‘20 ఏళ్లు ఓ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. చివరకు వదిలేసి వెళ్లిపోయారు. మిస్టర్ బైడెన్ మరోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది యెదవ’’ అని ట్వీట్ చేశారు. చెప్పు తెగుద్ది యెదవ అనడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్వీట్ హద్దులు దాటిందని కొందరంటే, ఆ మాత్రం డోస్ పడాల్సిందే అని నిఖిల్ అభిమానులు వెనకేసుకొస్తున్నారు. మొత్తానికి నిఖిల్ గురించి రాజకీయ కోణంలో చర్చించుకోవాల్సి వచ్చింది.