చేసిందే బూతు పని, మళ్లీ దాన్ని సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. తెలుగు ముసుగులో మన్మథుడు-2లో బూతుల్ని విచ్చలవిడిగా వాడిన ఈ దర్శకుడు విమర్శల పాలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం రాహుల్ తనను తాను సమర్థించుకున్నాడు. తను తెలుగుకు అత్యథిక ప్రాధాన్యం ఇచ్చానని, ప్రేక్షకులు మాత్రం అందులో బూతులు మాత్రమే చూస్తున్నారని తెగ ఇదైపోయాడు.
సినిమాలో ఓ సన్నివేశంలో లవణం అనే పదప్రయోగం ఉంటుంది. దీన్ని వెన్నెల కిషోర్ సాయంతో ఎంత బూతుగా మార్చాలో అంతగా మార్చేశారు. ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమే. “నువ్వు ఇప్పటివరకు నీ తుపాకి వాడలేదు” అంటూ నాగార్జున వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగ్స్ లాంటివి తెలుగంటూ రాహుల్ రవీంద్రన్ సమర్థించుకుంటున్నాడు. అందులో ఎంత బూతు ఉందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రేక్షకులు.
అయిందేదో అయిపోయింది. సినిమాలో భాగంగానే అలా చేశామనో, ఆ కథకు అలాంటి డైలాగులు మాత్రమే ఉండాలనో చెప్పుకుంటే సరిపోయేది. అలా సమర్థించుకోకుండా తెలుగు భాషోద్ధారణ అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు రాహుల్ రవీంద్రన్. చాన్నాళ్లకు అచ్చతెలుగు వాడామని ఊదరగొడుతున్నాడు. సరిగ్గా ఇక్కడే నెటిజన్లకు మండుతోంది.
రిలీజైన మూడో రోజుకే మన్మథుడు-2 చతికిలపడింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ఉందంటే ఉంది. అంతే తప్ప దానికి వసూళ్లు వస్తున్న దాఖలాలు మాత్రం లేవు. అందుకే ప్రమోషనల్ టూర్ ను కూడా రద్దుచేసిన నాగార్జున, ఇక తన ఆఖరి ప్రయత్నంగా స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో ఇంటర్వ్యూ వదిలాడు.