ఉన్నట్టుండి సడెన్ గా అనసూయ ఓ వీడియో పెట్టింది. ఆమె నుంచి వచ్చే వీడియోలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఆమె ఏం మాట్లాడలేదు. అలా ఏడుస్తూ ఉందంతే, ఆ వీడియో చూసి చాలామంది షాక్ అయ్యారు. దాని పక్కనే తన మనసులో భావాల్ని వెల్లడించింది అనసూయ.
ఆమె పెట్టిన పోస్టు చూసి చాలామంది, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ వల్ల అనసూయ ఇలా ఏడ్చిందని భావించారు. ఆ వెంటనే తన ఏడుపుపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడుపు ఆ ఏడుపు కాదంటూ చెప్పుకొచ్చింది.
“ఇనస్టాలో ఆ పోస్ట్ పెట్టిన తర్వాత హ్యాపీగా సెలూన్ కు వెళ్లి, ఫేషియల్ చేయించుకున్నాను. నేను అనుకున్నట్టుగానే చాలామంది నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. కానీ మిగతావాళ్లంతా సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను అస్సలు సోషల్ మీడియా నెగిటివిటీకి ఫీల్ అవ్వట్లేదు. నా ఫీలింగ్ ఏడుపుతో ఉండదు, కోపంతో ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాని కోసం ఏడ్చాను. ఆ క్షణాన్ని మరిచిపోకూడదనుకున్నాను, అందుకే షేర్ చేశాను.”
ఇలా తన ఏడుపు వెనక అసలు కారణాన్ని వెల్లడించింది అనసూయ. అయితే ఇదే విషయాన్ని ఆమె తొలి పోస్టులోనే నేరుగా వెల్లడించి ఉంటే సరిపోయేది. చాలామందికి అది అర్థం కాలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివిటీ చూసి అనసూయ ఏడుపు అందుకుందని పొరపడ్డారు.
“సోషల్ మీడియాలో నెగెటివిటీ నాపై ప్రభావం చూపడం లేదని నేను చెప్పను, కాకపోతే ఏడ్చి సింపతీ కొట్టేయాలని మాత్రం నాకు లేదు. కేవలం నాపై జరిగిన ట్రోలింగ్ వల్ల నేను ఏడ్చానని అనుకోవద్దు. నేను అంత బేలను కాదు.”
సెలబ్రిటీలు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, మీమ్స్ పెట్టాలని, సరదా ఫొటోషూట్స్ పోస్టు చేయాలని అంతా అనుకుంటారు. అయితే తమకు కూడా ఫీలింగ్స్-ఎమోషన్స్ ఉంటాయని, ఏడుపు కూడా వస్తుందని చెప్పడం కోసమే ఆ 'ఏడుపు వీడియో' పెట్టానని క్లారిటీ ఇచ్చింది అనసూయ. అయితే తను ఓ ఉద్దేశంతో వీడియో పెడితే, అది ఇంకేదో అయిందని ఆవేదన వ్యక్తం చేసింది.