ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా యోగి సినిమా రిలీజైంది. మెయిన్ థియేటర్ సుదర్శన్ 35ఎంఎం లో యోగి సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా థియేటర్ లో ఫ్యాన్స్ వీరంగం చేశారని, థియేటర్ ధ్వంసమైందంటూ కథనాలు వచ్చాయి. వీటిని థియేటర్ యజమాని బాలగోవిందరాజు ఖండించారు.
అసలు ఆరోజు యోగి సినిమాను ప్రదర్శించినప్పుడు థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. ఆరోజు కేవలం కొంతమంది మాత్రమే పండగ వాతావారణాన్ని భంగపరచడానికి ప్రయత్నించారని, వెంటనే తమ సెక్యూరిటీ సిబ్బందితో పాటు, ప్రభాస్ అభిమానులు వాళ్లను నియంత్రించారని రాజు వెల్లడించారు.
“కొంతమంది తాగి థియేటర్ లోకి ప్రవేశించారు. సినిమా ప్రదర్శన టైమ్ లో స్క్రీన్ కు దగ్గరగా వచ్చి డాన్స్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే మా భద్రతా సిబ్బందితో పాటు ప్రభాస్ అభిమానులు కొంతమంది వాళ్లను నిలువరించారు. దీంతో థియేటర్ లో భారీ డ్యామేజీ జరగకుండా అడ్డుకున్నట్టయింది.”
ఆ తర్వాత అదే అల్లరి మూక దగ్గర్లో ఉన్న కొన్ని బాటిళ్లను థియేటర్ లో పగలగొట్టారు. ఆ ఘటనలో కూడా ఎవ్వరూ గాయపడలేదని, థియేటర్ ప్రాపర్టీకి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు ఓనర్.
ఇలాంటి సినిమాలు రిలీజైనప్పుడు అవాంఛనీయ ఘటనలు జరగడం సహజమని, అందుకే తాము ప్రైవేటు భద్రతా సిబ్బంది (బౌన్సర్లు)ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపింది సుదర్శన్ థియేటర్ యాజమాన్యం. ఒక్కో బౌన్సర్ కు 5వేల రూపాయలు చొప్పున ఇచ్చి, మొత్తంగా 15 మంది బౌన్సర్లను ఏర్పాటుచేసుకున్నట్టు వెల్లడించారు.
ప్రతి రీ-రిలీజ్ కు తమకు 50వేల నుంచి 70వేల రూపాయల ఖర్చు అవుతోందని, థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నప్పుడు ఈమాత్రం ఖర్చును భరించక తప్పదన్నారు. ఓటీటీ వల్ల థియేటర్లకు ఇక ప్రేక్షకులు రారని భయపడుతున్న టైమ్ లో, రీ-రిలీజ్ దయ వల్ల ఫుట్ ఫాల్ పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.