సినిమా రివ్యూ: ఎవరు

సమీక్ష: ఎవరు రేటింగ్‌: 3/5 బ్యానర్‌: పివిపి సినిమా తారాగణం: అడివి శేష్‌, రెజీనా కసాండ్రా, నవీన్‌ చంద్ర, మురళి శర్మ, పవిత్ర లోకేష్‌, రాజా రవీంద్ర, నిహాల్‌ కోదాటి తదితరులు మాటలు: అబ్బూరి…

సమీక్ష: ఎవరు
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: పివిపి సినిమా
తారాగణం: అడివి శేష్‌, రెజీనా కసాండ్రా, నవీన్‌ చంద్ర, మురళి శర్మ, పవిత్ర లోకేష్‌, రాజా రవీంద్ర, నిహాల్‌ కోదాటి తదితరులు
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: గ్యారీ బి.హెచ్‌.
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
నిర్మాతలు: పర్ల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నే
దర్శకత్వం: వెంకట్‌ రామ్‌జీ
విడుదల తేదీ: ఆగస్ట్‌ 15, 2019

'ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌' అనే స్పానిష్‌ చిత్రాన్ని ఇటీవలే హిందీలోకి 'బద్‌లా' పేరిట రీమేక్‌ చేసారు. సినీఫైల్స్‌కి సుపరిచితమైన ఈ చిత్రాన్ని యథాతథంగా రీమేక్‌ చేస్తే ఎంత మందికి రీచ్‌ అవుద్ది అనేది తెలియదు. అందుకే ఆ కథకే మరో విధమైన స్క్రీన్‌ప్లే రాసి 'ఎవరు' రూపొందించారు. 'ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌' కథలో జరిగే సంఘటనలు, అందులో కథని నడిపించే టూల్స్‌ అన్నీ 'ఎవరు'లోను కనిపిస్తాయి. అయితే అక్కడ జరిగిన ఆర్డర్‌లో, అదే విధమైన కారణాలతో కాకుండా తెలుగు వెర్షన్‌లో డిఫరెంట్‌గా రన్‌ అవుతుంటాయి.

'ఎవరు' ఆరంభమవడం ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లేకి తగ్గట్టే స్టార్ట్‌ అయినా ఇన్వెస్టిగేషన్‌కి వచ్చిన ఆఫీసర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఒక మిస్సింగ్‌ కేస్‌ గురించిన కథ చెప్పడం, దాని మీదకి ఫోకస్‌ టోటల్‌గా తిప్పేసి ఇంటర్వెల్‌ పాయింట్‌కి అసలు కథతో దానిని లింక్‌ చేయడమనే ట్విస్ట్‌ భలే పండింది. తెలిసిన కథనే తెలివిగా ట్విస్ట్‌ చేసి ఆల్రెడీ చూసేసిన వారికి కూడా ఫస్ట్‌ హాఫ్‌తో డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడంలో ఎవరు సక్సెస్‌ అయింది.

ద్వితియార్ధంలో ఎక్కువ మార్పు చేర్పుల జోలికి పోకుండా ఒరిజినల్‌ ఫార్మాట్‌కి కట్టుబడి వున్నారు. ఇన్విజిబుల్‌ గెస్ట్‌ కథలోని ముఖ్య ఘట్టాలన్నీ ఎవరులోను వుంటాయి కానీ అవి డిఫరెంట్‌ ప్యాట్రన్‌లో జరుగుతుంటాయి. టైట్‌ స్క్రీన్‌ప్లేతో చాలా గ్రిప్పింగ్‌గా సాగే ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లేని డిస్టర్బ్‌ చేయడం, దానిని మరోలా చెప్పడం రిస్కుతో కూడుకున్న వ్యవహారం. హిందీ వెర్షన్‌లో జెండర్‌ స్వాపింగ్‌ చేసారే తప్ప ఒరిజినల్‌ని మార్చే ధైర్యం చేయలేదు.

కానీ 'ఎవరు'కి ఆ రిస్క్‌ క్యాలిక్యులేటెడ్‌గా తీసుకున్నారు. ఒరిజినల్‌ని మార్చడం సాహసమే అయినా కానీ దానిని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చారు. ఈ క్రమంలో ఒరిజినల్‌లో క్లయిమాక్స్‌ ట్విస్ట్‌లో వున్న 'నమ్మశక్యం' కాని పాయింట్‌ ఇక్కడ బిలీవబుల్‌గా మారింది. అయితే బద్‌లా లేదా స్పానిష్‌ చిత్రం చూసిన వారికి కూడా మరో కొత్త సినిమా చూసిన అనుభూతిని ఇవ్వాలనే తపనతో అవసరానికి మించిన ట్విస్టులు పెట్టారు. అలాగే శేష్‌, రెజీనా మధ్య ఇంటిలిజెంట్‌ టాక్‌ కూడా శృతి మించి కాస్త కన్‌ఫ్యూజ్‌ చేస్తుంది. కానీ అసలైన పతాక సన్నివేశం అద్భుతంగా పండింది. ఒరిజినల్‌, హిందీ రీమేక్‌లో ఇవ్వని ముగింపుని ఇంకో యాంగిల్‌లో ఇచ్చి హై నోట్‌లో ముగించారు.

కరప్టడ్‌ పోలీస్‌గా శేష్‌ అభినయం బాగుంది. ఆ పాత్రలో అతని నటన నేచురల్‌గా అనిపిస్తుంది. రెజీనా మంచి నటి అనేది తెలిసిందే. ఈ చిత్రంలోని కాంప్లెక్స్‌ క్యారెక్టర్‌ని ఆమె అద్భుతంగా పండించింది. నవీన్‌ చంద్ర పర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదనిపిస్తుంది. మురళీ శర్మ ఒక కీలక పాత్రలో కథకి దోహదపడ్డాడు. టెక్నికల్‌గా అత్యున్నత విలువలు ఏమీ లేవు కానీ ఈ కథకి అవసరమైన రీతిలో అన్నీ చక్కగా కుదిరాయి. నేపథ్య సంగీతం డ్రామాని ఎలివేట్‌ చేస్తూ, సస్పెన్స్‌ని సస్టెయిన్‌ చేసేలా సాగింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ బాగున్నాయి.

దర్శకుడు వెంకట్‌ రామ్‌జీ అసలు కథనాన్ని మార్చినా కానీ అసలు కథ, దాని ఎఫెక్ట్‌ డిస్టర్బ్‌ చేయకుండా బాగానే హ్యాండిల్‌ చేసాడు. కథలోనే మంచి స్టఫ్‌ వుండడం వల్ల దర్శకుడి పని సులువయింది. మధ్యలో కాస్త ట్రాక్‌ తప్పినట్టు అనిపించినా కానీ ఓవరాల్‌గా 'ఎవరు' సస్పెన్స్‌ని చివరి వరకు మెయింటైన్‌ చేస్తూ ఆకట్టుకుంటుది. ఒరిజినల్‌ చూసిన వారికి షాక్‌ వేల్యూ వుండదు కనుక వారి ఎక్స్‌పీరియన్స్‌ ఎలా వున్నా కానీ అసలు ఈ కథ గురించి తెలియని వారికి మంచి కిక్‌ ఇస్తుంది. మంచి కథలు ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ గుర్తింపుని, ఫాలోయింగ్‌ని పెంచుకుంటోన్న శేష్‌కి ఈ చిత్రం కూడా ఆ పేరు నిలబెడుతుంది.

బాక్సాఫీస్‌ వద్ద కూడా ఏ సెంటర్స్‌లో, జోనర్‌ లవర్స్‌ సపోర్ట్‌తో మంచి విజయం సాధించడానికి ఎవరుకి చాలా స్కోప్‌ వుంది. ఒరిజినల్‌ చూడని వారు తప్పక చూడాల్సిన చిత్రమిది. చూసిన వారికి కూడా ఇంటిలిజెంట్‌ ఛేంజెస్‌ ఎలా చేయవచ్చు అనేదానిపై అవగాహనని ఇస్తూ వారికీ తిరిగి ఆ మెమరీస్‌ని రీవిజిట్‌ చేసుకునే వీలు కల్పిస్తుంది.

బాటమ్‌ లైన్‌: క్లెవరు!
– గణేష్‌ రావూరి