పోలవరం విషయంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నదంటూ.. జగన్మోహనరెడ్డి సర్కారు ప్రస్తుతం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతో ఒప్పందాన్ని రద్దుచేసింది. దీనిపై విపక్షాలు నానా యాగీ చేసేశాయి. పోలవరం సాంతం ఆగిపోయినట్లుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాయి. అయితే తాజాగా కాబినెట్ సమావేశంలో.. వారంలోగానే రీటెండర్లు పిలవాలని, జాప్యంలేకుండా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని జగన్ ఆదేశించారు. విమర్శలు మరింతగా వెల్లువెత్తకముందే పోలవరం పనులను మళ్లీ ప్రారంభించేయాలనే నిర్ణయం జగన్ మాటల్లో కనిపిస్తోంది.
పోలవరం టెండర్లలో గతంలో అవినీతి జరిగిందనేమాట వాస్తవం. ఆ అవినీతిని కట్టడి చేసేందుకే జగన్ టెండర్లను రద్దుచేసిన మాట కూడా వాస్తవం. అయితే ఇక్కడ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబు గతంలో అంచనాలు పెంచి, రీటెండర్లు పిలవాలని సంకల్పించినప్పుడు, పాత ధరలకే పనిచేయడానికి నవయుగ సంస్థ ముందుకు వచ్చింది. నామినేషన్ పై ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్టు రద్దయింది.
రీటెండర్లు పిలిస్తే.. అంతకంటె తక్కువ ధరకు పనిచేయడానికి ఎవరైనా వస్తారా? అని పోలవరం అథారిటీ కూడా సూటిగా ప్రశ్నించింది. టెండరు వ్యయం పెరిగితే గనుక తాము భరించబోమని హెచ్చరించింది. ఈ హెచ్చరిక జగన్ ప్రభుత్వానికి చాలా పెద్ద సవాలు. రీటెండర్లు పిలుస్తున్న సమయంలో వారు ఆ విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోవాల్సి ఉంది.
పాత ధరకంటె ఒక్క రూపాయి తక్కువకైనా కొత్త టెండర్లను ఆమోదించి, పనులు అప్పగిస్తే గనుక.. అది జగన్ ప్రభుత్వం సాధించిన విజయం అవుతుంది. పాత కాంట్రాక్టు రద్దుచేసి.. కొత్తగా రీటెండర్లు పిలిచే జగన్ సర్కారు ప్రయత్నంపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేపథ్యంలో… దీనిద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏచిన్న లాభం జరిగినా.. ప్రతిపక్షాల నోళ్లకు తాళాలు పడుతాయి.
జగన్ నిర్ణయాలను పన్నెత్తి విమర్శించడానికి ఇక వారికి ధైర్యంచాలదు. అదే సమయంలో… జగన్ ప్రభుత్వం దూకుడుగా ప్రవర్తిస్తున్నదని అనుకునే సామాన్య ప్రజలకు కూడా, ఇది దూకుడు కాదని.. అవినీతిని చక్కదిద్దే ప్రయత్నం అని నమ్మకం కలుగుతుంది.