మహిళలకు జగన్ రాఖీ కానుకలు

రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు కానుకల్లాంటి పథకాలు ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరేసిన సీఎం, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని…

రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు కానుకల్లాంటి పథకాలు ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరేసిన సీఎం, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలందరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 25 లక్షల మందికి ఒక్కో కుటుంబానికి సెంటున్నర భూమి చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించారు.

వైఎస్ఆర్ భరోసా పథకం కింద.. ఇలా మంజూరైన భూమిని అక్కాచెల్లెళ్ల పేరిట మాత్రమే రిజిస్టర్ చేస్తామని, ఇలా చేయడం వల్ల చెల్లెమ్మలకు మరింత సామాజిక భద్రత చేకూరుతుందని స్పష్టంచేశారు. వచ్చే ఉగాది నాటికి అర్హులైన మహిళలందరికీ సెంటున్నర భూమి అందుతుందని, ఇది మహిళలకు తానిచ్చే కానుకని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి.

దీంతో పాటు డ్వాక్రా మహిళల్ని కూడా ఆదుకుంటామని, వచ్చే ఏడాది చివరి నుంచి డ్వాక్రా మహిళలకు దశలవారీగా నాలుగు సార్లు రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. దేశంలో తొలిసారిగా చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది తామేనని ప్రకటించారు.

స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వెంటనే అమెరికా పయనయ్యారు ముఖ్యమంత్రి జగన్. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన. తన సొంత ఖర్చుతో అమెరికా వెళ్తున్నారాయన. సీఎం అయిన తర్వాత జగన్ చేస్తున్న రెండో విదేశీ పర్యటన ఇది. ఇంతకుముందు జెరూసలెం వెళ్లారు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు. ఈ రెండూ వ్యక్తిగత పర్యటనలే.