క్రాస్ రోడ్ లో జగన్.. తేల్చాల్సిన సమయం వచ్చేసింది!

బీజేపీకి జగన్ దగ్గరా కాదు, అలాగని దూరమూ కాదు. కేంద్రంపై ఎప్పుడూ జగన్ పొగడ్తల వర్షం కురిపించలేదు, అలాగని ఘాటు విమర్శలు కూడా చేయలేదు. అప్పుడూ, ఇప్పుడూ ఆయన తటస్థ వైఖరితోనే ఉన్నారు. బీజేపీతో…

బీజేపీకి జగన్ దగ్గరా కాదు, అలాగని దూరమూ కాదు. కేంద్రంపై ఎప్పుడూ జగన్ పొగడ్తల వర్షం కురిపించలేదు, అలాగని ఘాటు విమర్శలు కూడా చేయలేదు. అప్పుడూ, ఇప్పుడూ ఆయన తటస్థ వైఖరితోనే ఉన్నారు. బీజేపీతో పొత్తుపై ఆయన ఎటూ తేల్చలేదు. దీంతో బీజేపీ కూడా గుంభనంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు జగన్ అటోఇటో తేల్చాల్సిన సమయం వచ్చేసింది.

2024 ఎన్నికల నాటికి ఎవరు ఏ గట్టున ఉంటారనేది వచ్చే ఏడాదికి క్లారిటీ వస్తుంది. ఈ మేరకు బీజేపీ దేశవ్యాప్తంగా చురుగ్గా పావులు కదుపుతోంది. సొంత మెజార్టీ కల అనే నిర్ణయానికి వచ్చిన బీజేపీ, మిత్ర పక్షాలను కాపాడుకునే పనుల్లో ఉంది. ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కూడా మిత్ర పక్షాలకు పదవుల పంపకంలో పెద్దపీట వేసింది అందుకే. అంతే కాదు, తటస్థ పార్టీలకు ఇప్పటినుంచే స్నేహ హస్తం అందించేందుకు సిద్ధపడుతోంది. అలాంటి వారంతా వైరి వర్గం కూటమిలో చేరకుండా జాగ్రత్తపడుతోంది.

బీజేపీకి జగన్ అవసరం

వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు కానీ, వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఏవైపు ఉంటాయో తేలిపోయే సందర్భం అది. అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం కాకపోతే.. ఆయా పార్టీలన్నీ అధికార బీజేపీకి మద్దతిస్తాయా, లేక కాంగ్రెస్ కూటమివైపు మొగ్గు చూపుతాయా అనేది  తేలిపోతుంది. దాన్ని బట్టే 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఏ గట్టున ఉంటుందనే విషయంపై ఓ అంచనాకు రావొచ్చు. 

ఇక మోదీకి కూడా రాబోయేది గడ్డుకాలమే. కరోనా కష్టకాలాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారని, వ్యాక్సినేషన్ విషయంలో విఫలం అయ్యారనే నిందలు మోస్తున్నారు మోదీ. ఆయన గడ్డం పెరుగుతోంది కానీ, ఎకానమీ రోజు రోజుకీ దిగజారిపోతోంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకానికి పెడుతున్నారు. రోడ్లు, కరెంట్ తీగలు, సెల్ టవర్లు.. ఇలా ఏదీ వదలడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

ఈ దశలో మోదీకి ప్రాంతీయ పార్టీల అవసరం చాలా ఉంది. అందులోనూ 22మంది లోక్ సభ, ఐదుగురు రాజ్యసభ సభ్యులున్న వైసీపీ లాంటి బలమైన పార్టీల అండ ఇంకా అవసరం. అందుకే బీజేపీకి జగన్ అవసరం అయ్యారు.

జగన్ కు బీజేపీ అవసరం..

రాష్ట్ర అభివృద్ధికి, నిధులకు బీజేపీ కావాలి. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే బీజేపీతో స్నేహం చేయాల్సిందే. మెడలు వచ్చి హోదా తెచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని స్వయంగా జగనే గతంలో ప్రకటించిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు నిధులను ఎడాపెడా ఖర్చు పెడుతున్నారు. 

కేంద్రం ఇచ్చే నిధుల లెక్క తీయాలంటూ బీజేపీ పట్టుబడుతోంది, వాటిని కలుపుకొంటేనే రాష్ట్రానికి వెసులుబాటు ఉంటుంది. ఈ దశలో కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకుని, రాష్ట్రంలో మరింత సమర్థంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్ కి తిరుగుండదు.

అందుకే బీజేపీతో ఆయనకు స్నేహం కావాలి. జగన్ కు కేంద్రంలో మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. బీజేపీని కాదని, ఆయన కాంగ్రెస్ కూటమికి మద్దతివ్వలేరు. సో.. జగన్ న్యూట్రల్ గా అయినా ఉండాలి, లేదా అధికార బీజేపీతో అయినా చెలిమి చేయాలి.

కాచుక్కూర్చున్న టీడీపీ

ఇప్పటివరకు ఏ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకోలేదు. తొలిసారి బీజేపీతో కలిస్తే లాభనష్టాలేంటి? పొత్తు పెట్టుకుంటే టీడీపీ విమర్శలకు దిగుతుంది. పెట్టుకోకపోతే.. తను వెళ్లి చేతులు కలిపేస్తుంది. ఏది జరిగినా జగన్ కు ఇబ్బందే. అందుకే టీడీపీ వేచి చూసే ధోరణిలో ఉంది. జగన్ నేరుగా బీజేపీతో కలిసే అవకాశం లేదు కాబట్టి, ఈలోగా 2024నాటికి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని తయారు చేయాలనేది చంద్రబాబు ఆలోచన.

ఒకవేళ బీజేపీ దీనికి ఇష్టపడకపోతే మాత్రం ఎన్నికల తర్వాత బీజేపీకి అవసరమైతే జగన్ సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది. ఆ ఫ్రెండ్ షిప్ ని చెడగొట్టేందుకే గోతికాడ నక్కలా కాచుకు కూర్చుంది టీడీపీ. ఎన్నికలకు ముందే బీజేపీతో కూటమి కట్టాలనుకుంటోంది.

ప్రత్యేక హోదాతో లింకు పెడితే సరి..

ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా బీజేపీతో జగన్ చేతులు కలపాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ ప్రత్యేక హోదా మాత్రమే. బీజేపీతో స్పెషల్ స్టేటస్ కు అనుకూలంగా ప్రకటన చేయించి, ఆ తర్వాత పొత్తు పెట్టుకుంటే ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. పైగా జగన్ ఇమేజీ మరింత పెరుగుతుంది. 

రాష్ట్రంలో బీజేపీకి కనీసం ఎంట్రీ దక్కుతుంది. ఈ ఒక్క ప్రకటన చేస్తే చాలు, ఏపీలో అప్పటివరకు బీజేపీ చేసిన తప్పులు, తీసుకున్న తప్పుడు నిర్ణయాలన్నీ సర్దుకుంటాయి. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనంత త్వరగా బీజేపీతో అనుసరించాల్సిన విధానంపై జగన్ ఓ నిర్ణయం తీసుకోక తప్పదు.