ఓవైపు నటుడిగా సార్పట్ట పరంపర సినిమాతో హిట్ కొట్టాడు. మరోవైపు నిజజీవితంలో తండ్రిగా ప్రమోషన్ అందుకున్నాడు. ఇలా రెండు ఆనందాలు ఒకేసారి అందుకున్నాడు హీరో ఆర్య. అయితే పంటి కింద రాయిలా ఓ కేసు మాత్రం ఈ నటుడ్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడు ఆ కేసు నుంచి కూడా బయటపడి ఊపిరి పీల్చుకున్నాడు ఆర్య.
శ్రీలంకకు చెందిన విద్జ అనే అమ్మాయి ఆర్యపై చెన్నైలో కేసు పెట్టింది. ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న ఈమె, ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, 70 లక్షల రూపాయలు తన నుంచి కొట్టేశాడని ఆరోపించింది. ఈ మేరకు ఆన్ లైన్ లో పోలీసులకు ఫిర్యాదుచేసిన సదరు యువతి, అందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఛాటింగ్ స్క్రీన్ షాట్స్ ను కూడా పోలీసులకు పంపించింది.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, ఆర్యను ప్రశ్నించారు. లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో తొలిసారి విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆర్యను ఏకంగా 6 గంటల పాటు విచారించారు. ఆ సమయంలో ఆర్యపై ఎన్నో పుకార్లు చెలరేగాయి. ఆ తర్వాత పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు సహకరించాడు ఆర్య. ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు ఛేదించారు.
ఆర్య పేరిట చెన్నైలోని పులియంతోప్ కు చెందిన అర్మాన్, హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు సదరు శ్రీలంక అమ్మాయిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. వాళ్లను అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ కేసు నుంచి ఆర్యకు క్లీన్ చిట్ ఇచ్చారు చెన్నై పోలీసులు.
అలా ఈ కేసు నుంచి సచ్చీలుడిగా బయటపడ్డాడు ఆర్య. ఇన్ని రోజులు తనపై నమ్మకం ఉంచి, తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాడు ఈ నటుడు. హీరో విశాల్ తో కలిసి ఆర్య నటించిన ఎనిమి సినిమా విడుదలకు సిద్ధమైంది.