తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి విరుచుకుపడ్డారు. ఒకప్పుడు తన చెల్లిగా కేసీఆర్‌తో అభిమానంగా పిలిపించుకున్న విజయశాంతి… కాలక్రమంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో అన్నపై ఒంటికాలిపై లేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన విజయశాంతి…ఆ పార్టీకి తెలంగాణలో భవిష్యత్ లేదని భావించి, బీజేపీలో చేరిపోయారు.
ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో పాటల సీడీని బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లేడీ అమితాబ్ విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రకటించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతితో కూరుకుపోయాయని విమర్శించారు. బీజేపీనే సురక్షిత పార్టీగా ఆమె చెప్పారు.
కేసీఆర్ అరాచకం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామనే ఆవేదన ఉందన్నారు. తాము అనుకున్న తెలంగాణ రాలేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా బీజేపీనే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
కేసీఆర్‌కు మైండ్ బ్లాక్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. కేసీఆర్‌కు బ్యాలెన్స్ తప్పిందని విజయశాంతి ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఆయన తీవ్ర ప్రస్ట్రేషన్‌లో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.
ఈటల రాజేందర్ గెలుస్తాడని, తాను అనవసరంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కేసీఆర్ భావిస్తున్నారని ఆమె అన్నారు. కాబట్టి కేసీఆర్ ఎప్పుడూ రాంగే అన్నారు. కేసీఆర్ ఎప్పుడూ రైట్ పర్సన్ కాదని తనదైన స్టైల్లో పంచ్‌లు విసిరారు.