విశాఖ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ కాస్త ఓవరాక్షన్ చేశారు. అసలే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండగా.. ఆయనను కాపాడేందుకు ఒక వైపు పోలీసులు నానా పాట్లు పడుతుండగా పవన్ కల్యాణ్ మాత్రం తన హీరోయిజం ప్రదర్శించుకోవాలనుకున్నట్టుగా అతి చేయడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే.. విశాఖలో పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చిందే పవన్ కల్యాణ్ అనుచరులు. ఆ ఉద్రిక్తతల్ని ఆయన మరింతగా పెంచి పోషించాలని అనుకున్నారు. కానీ.. పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించడంతో ఆయన ఓవరాక్షన్ ఫలించలేదు. పైగా పోలీసులపైనే జనసేన నాయకులు, నాదెండ్ల మనోహర్ తీవ్ర విమర్శలతో ఎదురుదాడికి దిగడం విశేషం.
ఇంతకూ ఏం జరిగిందంటే..
పవన్ కల్యాణ్ మూడురోజుల ఉత్తరాంధ్ర పర్యటనకోసం శనివారం విశాఖకు చేరుకున్నారు. ఆయన వస్తున్నారు గనుక.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్దసంఖ్యలో ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అదే సమయానికి విశాఖ గర్జన కార్యక్రమం నుంచి తిరిగి వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చిన మంత్రులు జోగి రమేష్, విడదల రజని, రోజా, ఇంకా వైవీ సుబ్బారెడ్డి తదితరుల వాహనాలపై జనసేన కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసిరారు. ఇది చాలా ఆకతాయి చర్య.
నిజానికి ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాలకు వచ్చారు. జనసేన కార్యకర్తలు అదుపుతప్పి మంత్రుల కార్లపై రాళ్లు , చెప్పులు విసరడం జరిగింది. రోజా గన్ మెన్ గాయపడ్డాడు. వైవీ సుబ్బారెడ్డి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా ఉండగా.. అక్కడినుంచి తాను బసచేసిన నోవోటెల్ హోటల్ కు బయల్దేరిన పవన్ కల్యాణ్.. వాహనంలోంచి లేచి బయటకు కనిపిస్తూ రోడ్ల మీద ఉన్న అభిమానులు, జనాలకు అభివాదం చేస్తూ వచ్చారు. అయితే.. పోలీసులు ఆయనను బతిమాలి. కారులోనే కూర్చోవాల్సిందిగా.. అలా కారు పైకి జనానికి కనిపించేలా లేవద్దు అని పదేపదే అడిగితే పవన్ వినిపించుకోలేదు. పైగా వారిదో వాదం పెట్టుకున్నారు.
మంత్రుల కార్లపై రాళ్లు, చెప్పులు వేసి.. జనసేన కార్యకర్తలు, వైసీపీ వారిని రెచ్చగొట్టిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ కారులోంచి బయటకు లేస్తూ ఎగస్ట్రాలు చేస్తే.. జనంలోంచి ఎవరైనా చెప్పులో, రాళ్లో వేస్తారనేది పోలీసుల భయం. అలాంటిదే జరిగితే గనుక.. శాంతి భద్రతలు అదుపుతప్పిపోతాయనేది వారి ఆందోళన! అందుకోసం ఒకవైపు పవన్ ను కారులోంచి టాప్ మీదికి లేవకుండా కూర్చోమని బతిమాలుతోంటే.. ఆయన పట్టించుకోకుండా ఎగస్ట్రాలు చేయడం చూస్తున్న వారికి చిరాకు తెప్పించింది.
చూడబోతే.. విశాఖలో శాంతి భద్రతల్ని సర్వనాశనం చేసేసి.. అక్కడ కొట్లాటలు జరిగేలా చూడడానికే పవన్ కల్యాణ్ వెళ్లారా.. లేకపోతే.. పోలీసుల మాటల్ని ఎందుకు గౌరవించరు.. అని చూస్తున్న వారికి అనిపించింది.