నారా చంద్రబాబునాయుడు.. శనివారం నాడు అంటే అక్టోబరు 15వ తేదీన హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఒక సమావేశం నిర్వహించారు. తేదీ కలిసివచ్చింది గనుక.. ప్రొఫెసర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు కూడా అర్పించారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇది సంతాపసభలాగా ఉన్నదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసేసి, పార్టీకి అంతో ఇంతో జవసత్వాలు అందించడానికి అందివచ్చే ఒకటిరెండు అవకాశాలను కూడా వాడుకోకుండా గాలికొదిలేస్తున్న చంద్రబాబునాయుడు.. సంతాపసభలాగా ఈ కార్యక్రమం నిర్వహించారనే విమర్శలు వస్తున్నాయి.
చంద్రబాబునాయుడు తన ప్రసంగంలో కొంత కామెడీ చేశారు. తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారట. కొత్తగా వచ్చేవారినందరినీ ఆహ్వానించాలట. ఇకనుంచి తెలంగాణ తెలుగుదేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా ఇతర పార్టీ నేతల వలసలు పెరుగుతాయట. ప్రతి కార్యకర్త మరో పదిమందిని తెలుగుదేశంలో చేర్పించడం అనేది పనిగా పెట్టుకోవాలట.. ఇదీ ఆయన సందేశం. ఇంతకంటె గొప్ప కామెడీ ప్రసంగం ఏముంటుంది?
చంద్రబాబునాయుడు దరిద్రమైన నిర్ణయాల వల్ల.. తెలంగాణలో కూడా ఎంతో ప్రజాదరణ ఉన్న తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోయింది. తెలుగుదేశం వాళ్లందరూ అధికార తెరాసలోకి, ఇతర పార్టీల్లోకి వలసపోయారు. ప్రజలు తెలుగుదేశాన్ని మర్చిపోయారు. మొన్నటిదాకా పార్టీకి అధ్యక్ష హోదా వెలగబెట్టిన ఎల్.రమణ కూడా తెరాసలోకి పోయారు. ఇంకా చంద్రబాబునాయుడు.. మన పార్టీలోకి రావడానికి ఇతర పార్టీల నేతలు ఎగబడుతున్నారు.. అంటూ భ్రమల్లో పెట్టే మాటలు మాట్లాడడం ఎందుకో కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు.
మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. రాజకీయ పార్టీగా మనుగడలో ఉన్నాం అని నిరూపించుకోవాలంటే.. మంచో చెడో.. పది ఓట్లు వచ్చినా సరే.. ఎన్నికల బరిలోకి దిగాలి. అధికార పార్టీల మీద తొడకొట్టాలి. ఆ తెగువ చంద్రబాబులో ఎటూ లేదు. లోకల్ లీడర్ పోటీచేస్తానంటూ ముందుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పి.. మనం కూడా పోటీచేద్దాం అని అడిగారు. నో చెప్పిన చంద్రబాబు.. ఆనాడే పార్టీకి సమాధి కట్టినట్టు లెక్క.
తీరా మునుగోడు నామినేషన్ల పర్వం కూడా పూర్తయిపోయిన తర్వాత.. ఒక మీటింగు పెట్టుకుని అసహ్యంగా అందరూ మన పార్టీలోకి రావడానికి ఉబలాటపడుతున్నారని అనడానికి.. ఆ కార్యకర్తలు, ముఖ్య నాయకుల ఎదురుగా ఆయనకు మొహం ఎలా చెల్లిందో కూడా అర్థం కావడం లేదు.