టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మూడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి రాజధానిపై అధికార పార్టీ వైసీపీ గత కొంత కాలంగా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తూ వచ్చింది. అయితే ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న తరుణంలో వైసీపీ వ్యూహాత్మకంగా దూకుడు పెంచింది. వైసీపీ, ఏపీ ప్రభుత్వ మౌనాన్ని టీడీపీ తక్కువ అంచనా వేసింది. దీంతో అమరావతిలోనే ఏకైక రాజధాని ఉండాలనే డిమాండ్‌తో రెండో దశ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.
కృష్ణా, గుంటూరు జిల్లాలు దాటిన తర్వాత వైసీపీ వ్యూహం ఏంటో టీడీపీకి తెలిసొచ్చింది. ఎన్నికల ముంగిట 29 గ్రామాల్లో మినహాయించి, మిగిలిన ప్రాంతాల్లో టీడీపీని ఒంటరి చేసేందుకు వైసీపీ వ్యూహాత్మక పథక రచన చేసిందని టీడీపీకి అర్థమైంది. పాదయాత్రకు అడుగడుగునా వ్యతిరేక గళాలు వినిపించడం చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా విశాఖ గర్జన ఘన విజయం సాధించడం వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఒకవైపు జోరున కురుస్తున్న వానను కూడా లెక్కచేయకుండా భారీ ర్యాలీ, అనంతరం నిర్వహించిన సభ విజయవంతం కావడం అధికార పార్టీకి భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేయడానికి నైతిక బలాన్ని ఇచ్చింది. హైకోర్టులో అనుకూల తీర్పు వచ్చిన తర్వాత కూడా ఉత్తరాంధ్రకు పాదయాత్ర చేయడాన్ని దండయాత్రగా ఆ ప్రాంత ప్రజానీకం భావిస్తున్నారు. రెండోదశ పాదయాత్ర వ్యూహాత్మక తప్పిదంగా చెప్పొచ్చు.
పాదయాత్ర చేపట్టకపోతే, వారికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో నేడు నిరసన ఉద్యమాలు పుట్టేవి కావు. అమరావతి పేరుతో తమను రెచ్చగొడుతున్నారని ఉత్తరాంధ్ర సమాజం రగులుతోంది. అమాయకులమని జీవితాలతో ఆడుకుంటారా? అని గర్జిస్తోంది. ఇదంతా టీడీపీ, అమరావతి పాదయాత్ర నిర్వాహకుల స్వయంకృతాపరాధం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన ప్రాంతానికి రాజధాని ఇస్తే, ఎందుకు అడ్డు తగులుతున్నారనే ప్రశ్నలు ఉత్తరాంధ్ర పౌర సమాజం నుంచి వస్తున్నాయి. తమ ప్రాంతం రాజధాని ఏర్పాటుకు అనుకూలం కాదా? అని నిలదీస్తున్నారు.
అందుకే మూడు రాజధానుల వ్యవహారంతో చంద్రబాబుకు మూడిందని చెప్పడం. చంద్రబాబు కుయుక్తులు జగన్ ఎత్తుగడల ముందు నిలబడడం లేదు. జగన్ మౌనంతోనే అన్నీ చక్కదిద్దుతున్నారు. ఉత్తరాంధ్రతో ఉభయగోదావరి జిల్లాల్లో నెమ్మదిగా రాజధాని అంశం వేడి రగుల్చుతోంది. ఇది రానున్న రోజుల్లో టీడీపీని దహించివేసే ప్రమాదం పొంచి వుంది.
రాయలసీమలో ఇప్పటికే చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ ప్రాంత వ్యతిరేకిగా చంద్రబాబును సీమ సమాజం గుర్తించింది. కేవలం 29 గ్రామాల కోసం, ఏపీ మొత్తాన్ని వ్యతిరేకి చేసుకోవడం అంటే, అమరావతి రాజధానితో చంద్రబాబుకు ఉన్న ఆర్థిక బంధం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం చివరికి అధికారాన్ని కూడా బలి పెట్టేంతగా!