మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత, మరింత మెరుగ్గా తయారయ్యేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె విదేశాలకు వెళ్లింది. దీంతో అంతా ఆమె చికిత్స కోసమే వెళ్లిందనుకున్నారు. కట్ చేస్తే, స్నేహితులతో కలసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది సమంత.
అలా విహార యాత్రను ముగించి హైదరాబాద్ చేరుకుంది. ఆ వెంటనే ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లో పాల్గొంది. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్ పై డాన్స్ కూడా చేసింది. దీంతో అంతా అవాక్కయ్యారు.
ఇప్పుడు సమంత మరోసారి విదేశీ పర్యటన షురూ చేసింది. కిందటిసారి స్నేహితులతో కలిసి ఇండోనేషియాతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించిన సమంత, ఈసారి తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లింది.
ఈసారి సమంత ట్రీట్ మెంట్ కోసమే అమెరికా వెళ్లి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. ఆమె శారీరకంగా మరింత దృఢంగా తయారయ్యేందుకు, కొన్ని వారాల పాటు చికిత్స తీసుకుంటుందని చెబుతున్నారు.
మరికొందరు మాత్రం న్యూయార్క్ లో జరగనున్న ఇండియా డే పరేడ్ లో పాల్గొనేందుకు సమంత వెళ్లిందని అంటున్నారు. ఇప్పటికే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి హీరోయిన్లు న్యూయార్క్ చేరుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా ఈసారి సమంత పూర్తి ఆరోగ్యంతో ఇండియాకు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.