ఓ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతపై ఏ స్థాయిలో ప్రభావం పడుతుందో అందరికీ తెలిసిందే. అతడిపై పడే ఆర్థిక భారాన్ని పూర్తిగా అతడు మాత్రమే మోయాల్సి ఉంటుంది. మరి అదే నిర్మాతకు ఓ భారీ బడ్జెట్ సినిమా దెబ్బేస్తే ఎలా ఉంటుంది? అక్కడితో ఆగకుండా, వెంటనే మరో డిజాస్టర్ పడితే? ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫేస్ చేస్తున్నారు అనీల్ సుంకర.
ఏజెంట్ సినిమా.. అనీల్ సుంకర కెరీర్ లోనే అతిపెద్ద దెబ్బ. నిజానికి ఆయనకు ఫ్లాపులు కొత్తకాదు. కాకపోతే ఓ మోస్తరుగా మాత్రమే పెట్టుబడి పెట్టి తీసిన సినిమాలు ఫెయిల్ అయినా, ఆయన తట్టుకొని నిలబడగలిగారు. ఇంకా చెప్పాలంటే, ఒక దశలో ఆయన ఫ్లాపుల్ని లెక్కచేయలేదు కూడా.
కానీ ఏజెంట్ సినిమా, ఈ నిర్మాత తీసిన గత సినిమాల్లాంటిది కాదు. హీరో మార్కెట్ కు, సినిమా బడ్జెట్ కు పొంతన లేకుండా తెరకెక్కిన మూవీ అది. ఫస్ట్ కాపీ చేతికొచ్చేసరికి బడ్జెట్ లెక్క చూసుకుంటే చుక్కల్ని తాకింది. ఇలాంటి సినిమా ఫెయిలైతే ఏ నిర్మాతకైనా కష్టమే. అనీల్ సుంకరకు కూడా.
ఏజెంట్ సినిమా ఆర్థికంగానే కాకుండా, అనీల్ సుంకర ఇమేజీని కూడా కొంచెం దెబ్బతీసింది. అయినా ఆయన చెక్కుచెదరలేదు. దీనికి కారణం భోళాశంకర్. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఉండొచ్చనుకున్నారు సుంకర. పైగా చిరు అప్పటికే వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ కొట్టి ఉన్నారు.
ఇలా చాలా అంచనాలు, మరెన్నో లెక్కలు వేసుకొని భోళాశంకర్ తీశారు ఈ నిర్మాత. అయితే ప్రీ-రిలీజ్ బిజినెస్ నుంచే ఈ నిర్మాత లెక్కలు తప్పడం మొదలైంది. ఇక సినిమా రిలీజైన తర్వాత అంచనాలు, లెక్కలన్నీ పూర్తిగా కొట్టుకుపోయాయి. ఏజెంట్, భోళాశంకర్ రూపంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రావడంతో అనీల్ సుంకర ఆర్థిక పరిస్థితి అటుఇటు అయింది. మధ్యలో సామజవరగమన రూపంలో హిట్టొచ్చినా, ఈ నష్టాలతో పోలిస్తే అది పీనట్స్ కింద లెక్క.
వరుసగా వచ్చిన 2 డిజాస్టర్లతో అనీల్ సుంకర కెరీర్ పై అనుమానాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ కు మరో నిర్మాత దూరమౌతాడనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అయితే అనీల్ మాత్రం బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నారు. అందరి ఆశీస్సులతో సక్సెస్ కొడతానంటున్నారు. వీలైనంత త్వరగా ఆయన ఓ సక్సెస్ అందించాలని కోరుకుందాం.